News

బ్రహ్మచారిణి అలంకరణలో శ్రీశైల భ్రమరాంబిక

305views

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీశైలంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం భ్రమరాంబికా అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, చండీహోమం, పంచాక్షరీ, చతుర్వేద పారాయణాలు, కుమారిపూజలు నిర్వహించారు. మల్లికార్జునస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రపారాయణాలు చేశారు. కుమారి పూజల్లో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం మయూరవాహనంపై బ్రహ్మచారిణి అలంకరణలో అమ్మవారు, మల్లికార్జున స్వామి శ్రీశైలం వీధుల్లో విహరించారు. సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అశేష భక్తజనం నడుమ దేవేరులతో గ్రామోత్సవం కోలాహలంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ డి.పెద్దిరాజు, అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు.

నేడు చంద్రఘంట అలంకారం

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబికా అమ్మవారు చంద్రఘంట అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు రావణవాహన సేవలో విహరిస్తారు.