
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెంకటగిరి శక్తి స్వరూపిణిగా వర్ధిల్లుతున్న పోలేరమ్మ జాతర బుధ, గురువారాల్లో కోలాహలంగా జరగనుంది.ఇటీవలే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన ఈ జాతరను వెంకటగిరి సంస్థానం ఆధ్వర్యంలో దశాబ్దాలుగా ఏటా వైభవంగా నిర్వహిస్తున్నారు.వినాయకచవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం రాత్రి మొదటి చాటింపు, మలి బుధవారం రెండో చాటింపు, మూడవ బుధవారం చివరి చాటింపుతో అమ్మవారిని భక్తుల దర్శనార్థం కొలువు తీరుస్తారు.రెండో చాటింపు తర్వాత వచ్చిన ఆదివారం అమ్మవారికి ఘటోత్సవం నిర్వహించడంతో జాతర సందడి మొదలైంది.పురవీధుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సోమవారం ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
రెండు రోజుల జాతరలో బుధవారం పోలేరమ్మ అత్తవారిల్లుగా భావించే కుమ్మరి వీధిలోని కుమ్మరింట మండపంలో అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు. ఈ ప్రతిమకు అలంకారం చేయకుండా బుట్టలో పెట్టి అమ్మవారి అత్తవారిల్లుగా భావించే జీనిగల వారి వీధిలోని చాకలింటి మండపానికి తరలిస్తారు.అమ్మవారికి దిష్టిచుక్క, నల్లగుడ్డు పెట్టి ఆభరణాలతో అలంకరిస్తారు. అనంతరం పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన రథం పై ఉంచి దివిటీల నడుమ ఊరేగింపుగా భక్తుల దర్శనార్ఘం అమ్మవారి దేవస్థానం వద్ద కొలువు దీర్చడంతో బుదవారం రాత్రి జాతర ముగుస్తుంది.గురువారం జరిగే అమ్మవారి విరూపోత్సవంతో జాతర ముగియనుంది.





