
650views
కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హృద్రోగ, కిడ్నీ సంబంధమైన సమస్యలతో ఏప్రిల్ 3న ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచి చికిత్స పొందుతున్న ఎస్పీవై రెడ్డి మంగళవారం ప్రాణాలు విడిచారు.

శ్రీ ఎస్పీవై రెడ్డి 1950 జూన్ 4న కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో జన్మించారు. వరంగల్ NIT నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన ఆయన 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి దిగారు. 2004, 2009, 2014లలో నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు.
శ్రీ SPY రెడ్డి గారు సంఘమిత్ర సేవా సమితి గౌరవాధ్యక్షులుగా కొనసాగుతూ సమితి చేసే సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందించేవారు. సంఘ్ పరివార్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే వారు. వారి పార్ధివ దేహానికి ఆరెస్సెస్ విభాగ్ సహ సంఘచాలక్ డాక్టర్ ఉదయ్ శంకర్, సేవభారతి ఆంధ్రప్రదేశ్ సహ కార్యదర్శి శ్రీ మనోహర్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఇతర స్వయంసేవక బంధువులు పూల మాలలు సమర్పించి నివాళులర్పించారు.

రేపు అనగా 02-05-19 తేదీ గురువారం ఉదయం 9:00 గంటలకు సంఘమిత్ర నందు శ్రీ SPY రెడ్డి గారి సంస్మరణ సభ జరుగుతుందని సంఘమిత్ర కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ తెలియజేశారు.





