News

వెంకన్న ఆలయంలో వైభవంగా సదస్యం

176views

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం వేకువజామున సుప్రభాత సేవ, పుణ్యాహవాచనం, ఐశ్వర్య లక్ష్మి హోమంలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన స్వామివారిని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వైఖానస ఆగమం ప్రకారం ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో స్వస్తి వచనములు, కల్యాణోత్సవ ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, విశేషార్చన, నీరాజన మంత్రపుష్పాలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి చతుర్వేద స్వస్తి, మహదాశీర్వచనం, సదస్యం జరిపారు. ఘనాపాఠీలు వేదస్వస్తి చెప్పాక భక్తులు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. బుర్రకథా కాలక్షేపం ఆకట్టుకుంది. రాత్రి స్వామివారి గ్రామోత్స వం వైభవంగా జరిగింది. పూజల్లో ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు- ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు-హైమాపార్వతి దంపతులు పాల్గొన్నారు.వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.72,979 లభించింది. బుధవారం గౌతమి గోదావరి నదిలో విద్యుత్‌ కాం తులు, మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ స్వామి తెప్పోత్సవం జరుగుతుంది.తెలంగాణ కళాకారుల కోలాటం, అన్నమయ్య సంకీర్తన ఉంటా యి. భక్తులు వేలాదిగా తరలివస్తారన్న దృష్ట్యా అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.