
అవినీతిపై చర్యలు తీసుకునే రాజకీయ సంకల్పానికి ఇప్పుడు లోటు లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అవినీతిపరులు ఎంతటి శక్తిమంతులైనప్పటికీ అధికారులు నిస్సంకోచంగా వారిపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నేరస్థులను విచారించడంలో ఆలస్యాన్ని నివారించాలని, వారికి వేగంగా శిక్షపడేలా చూడాలని సీబీఐని ఆదేశించారు. సత్యానికి, న్యాయానికి బ్రాండ్‌గా సీబీఐ మారిందని కొనియాడారు. సోమవారం ఇక్కడ సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మాట్లాడుతూ దేశాన్ని అవినీతి రహితం చేయడమే సీబీఐ కీలక బాధ్యత అని స్పష్టం చేశారు. న్యాయం, ప్రజాస్వామ్యంలకు అవినీతే అతిపెద్ద అడ్డంకి అన్నారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించేవారి నుంచి దృష్టి మళ్లించరాదని సీబీఐకి సూచించారు. దశాబ్దాలుగా అవినీతి ద్వారా లబ్ధిపొందినవారు ఇప్పుడు దర్యాప్తు సంస్థలపైనా దాడి చేసే వ్యవస్థను సృష్టించారని ఎద్దేవా చేశారు. ‘వారు మీ దృష్టి మళ్లిస్తారు. కానీ, మీ దృష్టి అంతా మీ పని మీదే ఉండాలి. అవినీతిపరులెవ్వరూ తప్పించుకోకూడదు. దేశం, చట్టం, రాజ్యాంగం మీతోనే ఉన్నాయి’ అన్నారు.
దశాబ్దం క్రితం దేశం కుంభకోణాలతో నిండిపోయిందని, నేరస్థులకు శిక్ష పడుతుందనే భయం లేకుండా చేసిందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే భారతదేశం అవినీతి వారసత్వాన్ని పొందిందని, కొంతమంది ఈ వ్యాధిని తొలగించే బదులు, పెంచుతూనే పోతున్నారని విమర్శించారు. ఇప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థ అంటే ట్రిలియన్ డాలర్ల గురించి మాట్లాడుకుంటున్నారని, కానీ, దశాబ్దం క్రితం సీబీఐ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకున్న రోజుల్లో దేశంలోని కుంభకోణాలకు ఆ సంఖ్యలను ఉపయోగించేవారని చెప్పారు. అవినీతిలో కొత్త రికార్డు సృష్టించడానికి పోటీ కూడా ఉండేదన్నారు. ఒకప్పుడు ప్రభావవంతమైన వ్యక్తుల ఫోన్ కాల్స్ ఆధారంగానే వేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసేవారని, ఆ లబ్ధిదారులు ప్రజల డబ్బుతో పారిపోయేవారని, వాటికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వచ్చాయని మోదీ చెప్పారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం ద్వారా రూ.20 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశామని తెలిపారు. డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) వల్ల తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా రూ.2.25 లక్షల కోట్లు ఆదా అయ్యాయని ప్రధాని మోదీ చెప్పారు.
మిషన్ మోడ్‌లో చర్యలు..
2014కు ముందు అప్పటి కేంద్ర ప్రభుత్వాల అవినీతి వల్ల మన ఆర్థిక మూలాలు, బ్యాంకింగ్ వ్యవస్థ నాశనమయ్యాయని మోదీ విమర్శించారు. 2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టగానే అవినీతి, బినామీ ఆస్తులపై మిషన్ మోడ్‌లో చర్యలు చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. అవినీతిపై దర్యాప్తులో ఫాస్ట్ ట్రాక్ మార్గాలు అన్వేషించాలని సీబీఐకి సూచించారు. ఇప్పుడు కూడా ఏదైనా కేసు పరిష్కారం కాకుంటే, సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయని, తన పని, సాంకేతికల ద్వారా సీబీఐ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని తెలిపారు. ‘ప్రతి ఒక్కరి పెదవులపైనా సీబీఐ పేరే. సత్యం, న్యాయాలకు అది బ్రాండ్‌గా మారింది’ అన్నారు. విశిష్ట సేవలందించిన 18 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీసు మెడల్స్, ఉత్తమ దర్యాప్తు నిర్వహించిన ముగ్గురు సీబీఐ అధికారులకు గోల్డ్ మెడల్స్‌ను ఈ సందర్భంగా మోదీ ప్రదానం చేశారు. షిల్లాంగ్, పుణె, నాగ్‌పూర్‌లలో కొత్తగా నిర్మించిన సీబీఐ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. సీబీఐ ట్విటర్ ఖాతాను, పోస్టల్ స్టాంపును, స్మారక నాణేన్ని మోదీ ఆవిష్కరించారు.





