
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ రాహుల్‌పై ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కోర్టులో పరువునష్టం దావా వేశారు కమల్ భదౌరియా అనే వ్యక్తి. పిటిషనర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. 2023 జనవరి 9న హరియాణాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ.. ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు. 21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ నిక్కరు ధరించి శాఖలు నడుపుతున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు.
‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను 21వ శతాబ్దపు కౌరవులతో పోల్చారు. ఆయన ప్రసంగం అసభ్యకరంగా ఉంది. ఆ ప్రసంగం రాహుల్ ఆలోచనా ధోరణిని తెలియజేస్తోంది. దేశంలో ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా సాయం చేసేందుకు ముందుండే సంస్థ ఆర్ఎస్ఎస్. ఈ కేసు ఏప్రిల్ 12న విచారణ జరగనుంది.’ అని పిటిషనర్ భదౌరియా తరఫు న్యాయవాది తెలిపారు.
కోర్టు మినహాయింపు కోసం..
మరోవైపు.. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు నుంచి శాశ్వత మినహాయింపు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వాదనలు విన్న కోర్టు.. ఏప్రిల్ 15కు ఈ కేసును వాయిదా వేసింది.
జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని 2014లో రాహల్ గాంధీ ఆరోపించారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ భివాండీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రాహుల్ గాంధీ 2018 జూన్‌లో కోర్టుకు హాజరయ్యారు. తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన సమయం కావాలని.. అందుకే కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపును ఇవ్వాలని రాహుల్ గాంధీ గతేడాది దరఖాస్తు దాఖలు చేశారు. అయితే సూరత్ కోర్టు రాహుల్‌ను ఇటీవల దోషిగా తేల్చిందని.. ఆయన ఎంపీ పదవికి కూడా అనర్హుడయ్యారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రజాప్రతినిధి కానందున.. ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని వాదించారు.





