
తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో అవ్వచారి కోన సమీపంలో రోడ్డు పైనే ఇద్దరు యువకులు ధూమపానం చేస్తూ కనిపించారు. సిగరెట్ సేవించిన తర్వాత యువకులు వింత చేష్టలు చేశారు. ఏదో ఘనకార్యం చేసినట్లు సెల్ఫీలు దిగారు. ఈ సీన్ మొత్తాన్ని దూరం నుంచి ఎవరో వీడియో తీశారు. రోడ్డుపై, కాలిబాట మార్గం పక్కనే ధూమపానం చేస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. భక్తులు మండిపడుతున్నారు.. ఇది భద్రతా వైఫల్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎండాకాలం.. పొరపాటున ఆ సిగరెట్ నిప్పు కిందపడితే పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి పెద్ద ప్రమాదమని అంటున్నారు.
గతవారం కూడా తిరుమలలో గంజాయి దొరకడం కలకలంరేపింది. వైకుంఠం క్యూ కంప్లెక్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరం దగ్గర విజిలెన్స్ అధికారులు గంజాయిని సీజ్ చేశారు. మొత్తం 125 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో ఈ ఘటనపైనా విమర్శలు వచ్చాయి.





