
ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడడం తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఫార్మా రంగం మార్కెట్ రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటోందని.. దీనిని రూ.10 లక్షల కోట్లకు పెంచాలని పిలుపిచ్చారు. ఇందుకోసం ప్రైవేటు రంగం, వైద్య విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆరోగ్యం-వైద్య పరిశోధనపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో సోమవారం ఆయన ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో ఏ టెక్నాలజీని కూడా దిగుమతి చేసుకునే అవసరం లేకుండా మన పారిశ్రామికవేత్తలు స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు. వైద్య చికిత్స వ్యయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం తన ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.80 వేల కోట్ల పేదల సొమ్ము ఆదా చేశామన్నారు. తీవ్రస్థాయి రోగాలకు చికిత్స కోసం పటిష్ఠ ఆరోగ్య వైద్య మౌలిక వసతుల కల్పన అవసరమని.. అందుకే లక్షన్నర ఆరోగ్య కేంద్రాలను ఈ దిశగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించాలంటే.. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచడం అత్యంత ఆవశ్యకమని ప్రధాని మోదీ చెప్పారు.





