
విజయనగరం జిల్లా రాజాం పరిధిలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 97 వార్షిక జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి భక్తులు తరలివస్తారు. చివరి రోజు మంగళవారం ఘటోత్సవం నాడు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. బొబ్బిలి డీఎస్పీ మోహనరావు, సీఐలు రవికుమార్, ఉపేంద్రరావు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆలయ నిర్మాణానికి సంబంధించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి. కానీ స్థల పురాణం పరిశీలిస్తే.. 1926లో రాజాంకు చెందిన వాకచర్ల మల్లయ్య మరికొందరి సహాయంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాది తిరగకముందే ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు. అప్పటి నుంచి వాకచర్ల కుటుంబీకులు వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. కొండంపేట గ్రామానికి చెందిన లంకలపల్లి కుటుంబీకులు ఘటాల పూజారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ పరిధిలో ఉన్న అమ్మవారి జాతర ఏటా పాల్గుణమాసం శుక్లపక్షం, పౌర్ణమి ముందు వచ్చే ఆది, సోమ, మంగళవారాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
అమ్మవారి జాతరలో ఘటోత్సవం కీలక ఘట్టం. ఈనెల 28న అమ్మవారి ఘటోత్సవం నిర్వహిస్తారు. దీంతో అమ్మవారి జాతర ముగిసినట్లువుతుంది. నేత్రోత్సవం రోజున రాజాంలోని అమ్మవారి దేవాలయం నుంచి అమ్మవారిని ఆవాహన చేసి.. అమ్మవారి కర్ర ప్రతిమలను తమవెంట కొండంపేటలోని ఘటాలయానికి తీసుకువెళతారు. తిరిగి మూడోరోజు మంగళవారం రాత్రి 12.02 గంటలకు లంకలపల్లి కుటుంబీకులు ఆలయానికి తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వదలి వెళ్లిపోతారు. దీనినే ఘటోత్సవం అంటారు.దీంతో జాతర ముగస్తుంది. ఈ మూడు రోజుల పాటు రాజాం పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తుంది.
అమ్మవారి జాతరలో ప్రారంభ ఘట్టంగా నిలిచే నేత్రోత్సవం శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈనెల 22న అమ్మవారి ఆలయంలో నవకళశ స్నపన కార్యక్రమం అనంతరం అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. నేత్రోత్సవం అనంతరం భక్తుల దర్శనానికి అవకాశం కల్పించారు. వంశపారంపర్య ధర్మకర్తలు వాకచర్ల కుటుంబీకులు అమ్మవారి తొలి దర్శనం చేసుకున్నారు. వాకచర్ల రాజా, వాకచర్ల పైడిరాజు, దుర్గా ప్రసాద్‌లు మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వీరితో ఆలయ ప్రధాన అర్ఛకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అమ్మవారి బుగ్గపై కాటుకతో చుక్క పెట్టి ఆలయం నుంచి వెనుదిరిగారు. ఓవైపు నేత్రోత్సవం జరుగుతుండగా కొండంపేట గ్రామానికి చెందిన ఘటాల పూజారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి గర్భగుడిలోనికి ప్రవేశించారు. తమవెంటన తెచ్చిన కర్ర ప్రతిమలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అక్కడి నుంచి ఆలయానికి ఎదురుగా ఉన్న వనంగుడి వద్దకు వెళ్లి కర్ర ప్రతిమలను అక్కడ ఉంచి పూజలు చేశారు. అక్కడి నుంచి తిరిగి నేరుగా గర్భగుడిలోనికి రెండోసారి చేరుకున్నారు. పూజల అనంతరం అమ్మవారిని కర్రప్రతిమలలో ఆవాహన చేసి కొండంపేటలోని ఘటాలయానికి తీసుకువెళ్లారు.





