
చిత్తూరు జిల్లా కాణిపాకంలో నూతన ఆర్జిత సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. గురువారం ఆలయ సమావేశ మందిరంలో ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. సహస్త్ర నామార్చన, మహా మంగళ హారతి… ఈ రెండు సేవలూ మార్చి 4 నుంచి ఆలయంలో ప్రారంభిస్తారు. సహస్త్ర నామార్చన ప్రధాన ఆలయంలో ప్రతి రోజు ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు, 6.30 నుంచి 6.45 గంటల వరకు మహా మంగళ హారతిని నిర్వహించనున్నారు. ఈ రెండు సేవలకు కలిపి టికెట్టు ధరను రూ. 1000గా నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రం, రవిక, పెద్ద లడ్డూ ఇస్తారు.
వచ్చే నెల మార్చి 5 నుంచి ఈసేవ ప్రారంభిస్తారు. ఈ టికెట్టు తీసుకున్న వారు ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయంలో నిర్వహించే 13 రకాల సేవల్లో పాల్గొనవచ్చు. ఈ సేవ టిక్కెట్టు ధర లక్ష రూపాయలు. ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి ఉదయం పులిహోరా, చక్కెర పొంగళితో పాటు మధ్యాహ్నం భోజనం, బస చేయడానికి ఏసీ గదిని రెండు రోజుల పాటు ఇస్తారు. శేషవస్త్రాలైన కండువా, రవిక ముక్కతో పాటు ఒక పెద్ద లడ్డూ, రెండు చిన్న లడ్డూలు, మూడు వడలను అందిస్తారు. లక్ష రూపాయలు చెల్లించిన భక్తులు ఈ సేవను సంవత్సరంలో ఒక్క రోజు వంతున పది సంవత్సరాల పాటు స్వామి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
ఏనుగును కానుకగా అడుగుతున్నాం..
మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు లక్ష మోదక లక్ష్మీ గణపతి హవన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా వరసిద్ధుడి ఆలయంలో నిర్వహించనున్నట్లు ఈవో, చైర్మన్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ శాంతి కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి, ఉత్తరాధికారులు స్వాత్మానందేంద్ర స్వామి హాజరవుతారని తెలిపారు. అలాగే ట్రావెన్‌కో రాజమాత మార్చి 1న ఆలయానికి విచ్చేయనున్నట్లు తెలియజేశారు. వరసిద్ధుడి ఆలయానికి ఓ ఏనుగును కానుకగా రాజమాతను అడుగనున్నట్లు తెలిపారు.





