
హాలీవుడ్ ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియో అసోం ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రంలోని కజిరంగ నేషనల్ పార్కులో ఖడ్గమృగాల సంరక్షణకు తీసుకుంటన్న చర్యలపై ఆయన స్పందించారు. ఖడ్గమృగాలు వేటకు బలి కాకుండా అసోం ప్రభుత్వం తీసుకుంటున్న తీరుని అభినందించారు. ఇక దీనిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. కజిరంగ నేషనల్ పార్క్‌ను విజిట్ చేయాలని లియోనార్డోని కోరారు. అయితే.. ఖడ్గమృగాలు అంతరించిపోకుండా అసోం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని లియోనార్డో ఇన్‌స్టా వేదికగా పొగిడారు. దీనికి బదులిచ్చిన హిమంత బిశ్వ శర్మ… ఓ సారి వచ్చి సందర్శించాలంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లియోనార్డో చేసిన పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు హిమంత.
“2000-21 మధ్య కాలంలో భారత్‌లో మొత్తం 190 ఖడ్గమృగాలు వేటకు బలి అయ్యాయి. కేవలం వాటి కొమ్ముల్ని అమ్ముకు నేందుకు వేటగాళ్లు దారుణంగా వాటిని చంపేశారు. అసోం ప్రభుత్వం ఇప్పుడు రంగంలోకి దిగింది. వేటకు గురి కాకుండా వాటిని సంరక్షిస్తోంది. కజిరంగ నేషనల్ పార్క్‌లో వాటిని సంరక్షిస్తోంది. ప్రస్తుతం అక్కడ 2,200 ఖడ్గమృగాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖడ్గమృగాల్లో ఇది మూడో వంతు.” అని లియోనార్డో డికాప్రియో తన ఇన్‌స్టా గ్రాంలో తెలిపారు.





