News

తమిళనాడులోని ఆలయాల్లో ఉండే ఏనుగులకు ప్రత్యేక వసతుల కల్పన

361views

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పోషించే ఏనుగులకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు పేర్కొన్నారు. కోయంబత్తూర్‌ జిల్లా పేరూర్‌ బడ్డీశ్వరాలయంలో కల్యాణి అనే ఏనుగు స్నానం చేసేందుకు అనుకూలంగా రూ.60 లక్షలతో నిర్మించిన నీటితొట్టెను మంత్రి ప్రారంభించారు. అనంతరం పేరూర్‌ ఆధీనంలో ఉన్న అర్చకులు, గురుకులం శిక్షణ పాఠశాలలో శిక్షణ పూర్తిచేసిన 84 మంది విద్యార్థులకు శివదీక్ష ధృవపత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ దేవాదాయ శాఖ నిర్వహణలోని 27 ఆలయాల్లో 29 ఏనుగులను సంరక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో 17 ఆలయాలకు ధర్మకర్తలను నియమిస్తామని, మరుదమలై మురుగన్‌ ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం లిఫ్ట్‌ ఏర్పాటు పనులను వచ్చే నెలలో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.