
కులాన్ని దేవుడు సృష్టించలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘మనం సమాజంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. చేసే ప్రతిదీ సమాజం మంచికోసమే అయినప్పుడు ఒక పని గొప్పది… మరొక పని నీచం ఎందుకవుతాయి? నాకు అందరూ సమానమే అని భగవంతుడు ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. కులాలు, వర్ణాలు ఆయనకు లేవు. అవన్నీ మనం సృష్టించుకున్నవే” అని ఆయన తెలిపారు. సంత్ శిరోమణి రోహిదాస్ ‘647వ జయంతి’ సందర్భంగా ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భాగవత్‌జీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశీ మందిరాన్ని ధ్వంసం చేసిన తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్, ఔరంగజేబుకు లేఖ రాశారని.. ‘హిందువులు, ముస్లింలు ఒకే దేవుని బిడ్డలు. మీ రాజ్యంలో ఒకరి మీదనే దాడులు చేయడం తప్పు. అందరినీ సమానంగా చూడటం మీ బాధ్యత అని అలాంటి పనులు ఆపకుంటే నా కత్తితో సమాధానం ఇస్తాను.’ అని ఆ లేఖలో శివాజీ రాశారని.. భాగవత్‌జీ పేర్కొన్నారు.
”తులసీదాస్, సూర్‌దాస్, కబీర్‌లతో సమానమైన వారు సంత్ రోహిదాస్. శాస్త్రాలలో ఆయన పండితుల్ని గెలవలేక పోయి ఉండొచ్చు. కానీ ఆయన బోధనలు అనేక మంది హృదయాలను హత్తుకున్నాయి. వారిలో దేవుని మీద నమ్మకాన్ని పెంచాయి. మీ మతాల ప్రకారం మీ పని చేయండి. సమాజాన్ని ఏకం చేయడం, దాని అభివృద్ధి కోసం పాటుపడటం… ఇదే మతం చెప్పేది’ అని మోహన్ భాగవత్ జీ అన్నారు.