
బెంగాల్ ఎన్నికలలో బంగ్లాదేశీ నటులు తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు సమర్ధించుకున్నారు. “అలా ప్రచారం నిర్వహించరాదని రాజ్యాంగంలో రాయలేదుగా?” అని ఆ పార్టీ నేత మదన్ మిత్రా ప్రశ్నించారు. రేపు బంగ్లాదేశ్ ఎన్నికలలో ఏదైనా ఒక రాజకీయ పక్షం తరపున భారతీయులెవరైనా ప్రచారం నిర్వహించేందుకు బంగ్లాదేశ్ అంగీకరిస్తుందా?

ఎన్నికల్లో గెలవడానికి, రాజ్యాంగం వద్దనలేదు కాబట్టి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మోస్ట్ వాంటెడ్ ప్రపంచ ఉగ్రవాది మసూద్ అజార్ల వల్ల కూడా ఓట్లు రాలుతాయనుకుంటే మన దేశ రాజకీయ పక్షాలు వారినీ ప్రచారానికి తీసుకొస్తారేమో? అటువంటి వారి సాయంతో గెలిచినవారు రేపు భారత్ పాక్ ల మధ్య ఏవైనా ద్వైపాక్షిక సమస్యలు వచ్చినపుడు పూర్తిగా భారత ప్రయోజనాల కోసం పని చేస్తారని ఎలా నమ్మటం? అది సాధ్యమేనా? అలాంటి సభ్యుల మద్దతుతో ఏర్పడ్డ ప్రభుత్వం ఎవరి చెప్పు చేతలలోకి వెళుతుంది? ఎవరి కనుసన్నలలో పనిచేస్తుంది?

స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కూడా జాతి ప్రయోజనాల కంటే తమ రాజకీయ స్వార్ధ ప్రయోజనాలకే పెద్ద పీట వేసే నాయకుల కారణంగా మన దేశం అనేక విషమ పరిస్థితులను ఎదుర్కొన్నది. గాంధీ, నెహ్రూలతో కూడిన అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ఆరెస్సెస్ నాయకులు శ్రీగురూజీ వంటి వారి హెచ్చరికలు పెడ చెవిన పెట్టి ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని అవలంబించడం వల్ల అది దేశ విభజనకు దారి తీసింది. తర్వాత కూడా పాకిస్థాన్, చైనాలతో అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ వ్యవహార శైలిపై పదేపదే శ్రీ గురూజీ చేస్తూ వచ్చిన హెచ్చరికలు పెడ చెవిన పెట్టిన కారణంగా వాటితో యుద్ధం జరిగిన రెండు సందర్భాలలోనూ భారత్ తన భూభాగాలను సైతం కోల్పోవలసి వచ్చింది. ఇప్పటికీ పాక్ కాశ్మీర్ ను, చైనా అరుణాచల్ ను దురాక్రమించజూస్తున్నాయి. కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతూనే వుంది. పాక్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడిన, పడుతున్న వారి వల్ల కాశ్మీర్, బెంగాల్, అస్సాం, మేఘాలయ వంటి రాష్ట్రాలలో స్థానిక ప్రజల బ్రతుకు దుర్భరంగా మారుతున్న విషయాన్ని దురదృష్ట వశాత్తు అటు రాజకీయ పార్టీలుగానీ, మీడియా గాని పట్టించుకోవటం లేదు. మత ఛాందస వాదుల వల్ల అంతర్గతంగానూ, బాహ్యంగానూ దేశానికి పొంచి వున్న ప్రమాదాల పట్ల కొన్ని రాజకీయ పక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు వున్నాయి. కాసిని వోట్లకు కక్కుర్తి పడి దేశ ప్రయోజనాలనే పణంగా పెడుతున్న రాజకీయ నాయకుల, పక్షాల పోకడ దేశానికి అత్యంత ప్రమాదకరం.

కొన్ని వందల సంవత్సరాల పోరాటం, వేలాది మంది బలిదానాలతో సిద్దించిన స్వేచ్చా స్వాతంత్ర్యాల విలువ తెలియని నాయకులు పుట్టుకొస్తారని అంబేద్కర్జీ ఊహించి ఉంటే ఖచ్చితంగా ఎన్నికలలో విదేశీయుల ప్రభావం ఏ విధంగానూ పడకుండా నిబంధనను చేర్చి వుండేవారేమో?
నిజానికి ప్రతి విషయాన్నీ రాజ్యాంగంతో ముడి పెడుతూ అడ్డగోలుగా మాట్లాడటం ఒక ట్రెండ్ గా మారుతోంది. తాము చేసే ప్రతి అనైతిక వ్యవహారాన్నీ చెల్లుబాటు చేసుకోవడానికి రాజ్యాంగాన్ని అడ్డుగోడగా వాడుకుంటున్నారు. వీళ్ళకి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు మాత్రమే కావాలిగానీ బాధ్యతలు మాత్రం పట్టవు. స్వాతంత్ర్యానంతరం అప్పటి భారతీయ సమాజంలోని ప్రముఖులు, మేధావులతో ఏర్పడిన రాజ్యాంగ సభ అంబేద్కర్ అనబడే దార్శనికుడి నేతృత్వంలో రాజ్యాంగ రచన చేసింది. పెరుగుతున్న కోటానుకోట్ల మంది యొక్క దైనందిన జీవితంలో ఆచరించే ప్రతి విషయానికీ పరిధులు ఎర్పరచగలిగే శాసనాలను రూపొందించటం సాధ్యమా? ఇలా ప్రతి దానికీ “రాజ్యాంగంలో ఇలా రాయలేదు కదా? అలా రాయలేదు కదా? “ అంటూ రంధ్రాన్వేషణ చేయటం రాజ్యాంగ కర్తలను, అంబేద్కర్ ను అవమానించటం కాదా?

రాజ్యాంగం గొప్పగానే వ్రాయబడింది. కానీ దానిని అమలు చేసే వ్యక్తులకు చిత్తశుద్ది లేకపోతే ఎంత గొప్పగా వ్రాసి ఏమి ప్రయోజనం? ఎన్నికలలో పాల్గొనే విదేశీయుల ఆర్ధిక సాయం తీసుకోరాదు. నిజానికి డబ్బు మాత్రమే కాదు ప్రజలను ప్రభావితం చేసే ఏ విధమైన సాయం తీసుకోరాదన్న కనీస జ్ఞానం ఎవరికి వారే కలిగివుండాలి. విదేశీయుల సాయంతో గెలిచిన అభ్యర్ధులు, సభ్యులు వారి భవిష్యత్ అవసరాల దృష్ట్యా అయినా ఆ విదేశీ శక్తుల స్వార్ధ ప్రయోజనాలకు సహకరించరని గ్యారంటీ ఏమిటి?
ఏ దేశ రాజ్యాంగం అయినా ‘1” లాంటిదే. కానీ దానిని అమలు చేసే వ్యవస్థ ‘0’ లాంటిది. అది కుడి పక్కన ఉంటుందా? ఎడం పక్కన ఉంటుందా? అన్నది ఆయా వ్యవస్థలను నిర్వహించే వ్యక్తుల నిబద్దత మీద ఆధారపడి వుంటుంది. ఇప్పుడు మన వ్యవస్థ ముందు ఈ ప్రశ్న తలెత్తడం మన స్వతంత్ర్య భారతానికి సవాలుగా నిలుస్తోంది.
- గజ్జెల మోహన్, విజయవాడ.





