News

లిక్కర్‌ దుకాణాలను గో శాలలుగా మారుస్తాం – బీజేపీ నేత ఉమాభారతి వెల్లడి

259views

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్‌ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ఆమె ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆమె .. నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న లిక్కర్‌ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సర్కార్‌ను డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. హిందూ ఆలయల సమీపంలో ఉండే బార్‌లను గోశాలలుగా మార్చుతామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో బోపాల్‌ నగరంలోని అయోధ్య నగర్‌లో ఉన్న ఓ ఆలయం వద్దకు చేరుకుని (సమీపంలోని లిక్కర్‌ షాప్‌ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్‌తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్‌ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్‌ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్‌ సర్కార్‌ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు.