News

ఢిల్లీ వర్సిటీల్లో ఆగని బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ

274views

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీ ప్రదర్శనల రచ్చ ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ), అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు శుక్రవారం తలపెట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనలను వర్సిటీ వర్గాలు, పోలీసులు అడ్డుకున్నారు. డీయూ క్యాంప్‌సలో ప్రదర్శనలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో జనసమీకరణపై నిషేధం విధించారు. మరోవైపు అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రదర్శనను అడ్డుకునేందుకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ప్రదర్శనను అడ్డుకోవడం, క్యాంప్‌సలోకి పోలీసులను అనుమతించడంతో ఇరు వర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలను అడ్డుకునే క్రమంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. డీయూ క్యాంప్‌సలో సాయంత్రానికి ఆందోళనలు తీవ్రమయ్యాయని, 24 మందిని అరెస్టు చేశామని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. మరోపక్క, విద్యార్థులు, అధ్యాపకుల వినతి మేరకు జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో శుక్రవారం కూడా తరగతులు నిర్వహించలేదు.