
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు దఫాలుగా సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు తొలి దఫా సమావేశాలు జరుగుతాయి. 15 రోజుల విరామం తర్వాత రెండో దఫా సమావేశాలు జరగుతాయి. కాగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2023ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. 31 నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోపే ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలున్నట్లు అధికార బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతి పండగ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపేందుకు ప్రధాని మోదీ సన్నాహాలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. దీంతో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రాతినిధ్యం కల్పిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ నుంచి బీసీ నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన కూడా పలకనున్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ఈ నెల 20తో ముగుస్తున్న నేపథ్యంలో పార్టీలో పెద్దఎత్తున సంస్థాగత మార్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ మార్పులను దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.





