News

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

315views

భారతీయ సినీ ప్రేక్షకులు అందరూ సగర్వంగా తల ఎత్తుకుని చూసే సమయం ఇది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు…’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం అటు తెలుగు సినిమాకే కాకుండా.. యావత్తు భారతదేశానికి గర్వకారణంగా నిలిచిపోయింది. నాన్‌ – ఇంగ్లీష్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాటకు అవార్డు దక్కింది. ఈ విషయాన్ని గోల్డెన్‌ గ్లోబ్‌ నిర్వాహకులు ప్రకటించగానే.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం చిన్న పిల్లల్లాగా కేరింతలు కొట్టారు.

సుమారు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు బెస్ట్ నాన్ – ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ సైతం నామినేషన్ దక్కించుకున్నారు. ఈ అవార్డుల వేడుకకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరయ్యారు. వీరితోపాటు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఉన్నారు. రెడ్ కార్పెట్ మీద ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకల్లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, రాజమౌళి సతీమణి రామ, కీరవాణి సతీమణి శ్రీవల్లి చీరకట్టుతో హాజరవడం ప్రత్యేకంగా చెప్పవచ్చు.