News

అబ్దుల్‌ కలాం వర్సిటీలో ఉద్యోగ నియామకాలపై కేరళ గవర్నర్‌ సీరియస్‌.. ఎందుకంటే?

296views

కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ క్యాంపస్‌ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించే నోటిఫికేషన్‌పై పెద్దఎత్తున దుమారం రేగుతోంది. అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్, ఆఫీస్ అటెండెండర్‌, డ్రైవర్-కమ్-ఆఫీస్ అటెండెంట్ ఖాళీల కోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రస్తుతం కేటీయూలో 90 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. యూనివర్సిటీ అసిస్టెంట్ల ర్యాంక్ జాబితాను పీఎస్సీ సిద్ధం చేసింది. శాశ్వత నియామకానికి అనుమతి లేనందున, పీఎస్‌సీ ర్యాంక్ జాబితా నుంచి తాత్కాలిక నియామకాలు చేయవచ్చు. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల సెట్టింగ్‌, వాల్యుయేషన్‌, మార్కుల పట్టిక, సర్టిఫికెట్ల పంపిణీ తదితర పరీక్షల విధుల్లో తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తే అక్రమాలు చోటుచేసుకుంటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ గవర్నర్‌ స్పందించి ఉద్యోగాల నియామక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు.

వైస్‌ ఛాన్సలర్‌ ఎంపిక నుంచి వివాదాలు..
ఇటీవల యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ గా డాక్టర్ సిజా థామస్ ను నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒప్పంద ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఆ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే వీసీకి తెలిసింది. దానిపై రిజిస్ట్రార్ సంతకం చేశారు. యూనివర్సిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఛాన్సలర్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. ఆయన వీసీని వివరణ కోరారు. ఛాన్సలర్‌కు వీసీ ఇచ్చిన నివేదికలో తనకు తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు.

సీరియస్‌ అయిన గవర్నర్‌..
ఇక దీనిపై షోకాజ్ నోటీసులు జారీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరారు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీల ద్వారా తాత్కాలిక ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, అధికార ఫ్రంట్ (లేదా పార్టీకి) కు మద్దతుగా ఉండే అభ్యర్థులను నియమించడానికి నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఉందని తెలియజేసింది. ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు ఉంటాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసినప్పటికీ.. ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పలేదు. ఈ ‘షరతులు’ పెద్ద ఎత్తున అవినీతికి సాకుగా ఉన్నాయని ఆరోపణలు రావడంతో గవర్నర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఇక మరోవైపు సీపీఎం నేత పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో బంధుప్రీతి, అవినీతి ఎక్కువైందని ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ నోటిఫికేషన్‌ వివాదంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ.. వీసీని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వీసీలుగా డమ్మీలను నియమించి.. వర్సిటీల్లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడేందుకే ఇలాంటి కుట్రలు చేయడానికి కొందరు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని పలువురు విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు.