
కర్ణాటక రాష్ట్రం బెల్గావి జిల్లా శ్రీరామ సేన సంఘ జిల్లా అధ్యక్షులు రవి కోకిట్కర్, అతని డ్రైవర్‌పై గుర్తు తెలియని ఓ వ్యక్తి హిండల్గా గ్రామ ప్రాంతంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరూ అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బెల్గావి నగర పోలీస్ కమిషనర్ ఎంబీ బోరాలింగయ్య మాట్లాడుతూ.. కాల్పుల ఘటన దర్యాప్తునకు నాలుగు బృందాలను పంపి నిందితుడి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నామని వివరించారు. త్వరలో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు.
రవి కోకిట్కర్ ఇటీవల చేసిన డిమాండ్ ఇదే..
స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్ ను అప్పట్లో సుమారు 99 రోజులపాటు కర్ణాటక జిల్లాలోని హిండల్గా జైలులో ఉంచారు. ఈక్రమంలో ఆయన చిత్రపటాన్ని జైలులో ఉంచాలని రవి కోకిట్కర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనిపై కాల్పులు జరగడంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
ఘటనను ఖండించిన శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షులు ..
ఈ ఘటన జరిగిన వెంటనే శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షులు ప్రమోద్ ముతాలిక్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు హిందువులు భయపడరని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీ తలపెట్టిన హిందూ సమాజోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. కాల్పులకు కారకులైన వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని శిక్షపడేలా చూడాలని ఓ వీడియో సందేశం ద్వారా ఆయన కోరారు.





