News

పరివర్తనే పరమ మంత్రం

216views

కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజు పేట గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అధ్వర్యంలో ఉగాది కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ విజయవాడ విభాగ్ బౌద్దిక్ ప్రముఖ్ శ్రీ చక్రధారి పాల్గొని ప్రసంగించారు. ఉగాది ప్రకృతిలో, గ్రహగతులలో అనేక మార్పులు జరిగే సమయమని ఆయన వివరించారు. ఉగాదితో చెట్లన్నీ చిగురించడం మొదలవుతుందని, ప్రకృతి అంతా కొత్త శోభను సంతరించుకుంటుందని తెలిపారు. షడ్రుచుల ఉగాది పచ్చడి జీవితంలో ఎదురయ్యే కష్టం సుఖం, కలిమి లేమి, వెలుగు నీడలకు సూచికని తెలిపారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కి ఉగాది పర్వదినం చాలా ముఖ్యమైనదన్నారు. ఆరెస్సెస్ స్థాపకులు డాక్టర్ కేశవ బలీరాం హెడ్గేవార్ ఉగాది నాడే జన్మించారని తెలిపారు. మన దేశం వేల యేండ్ల పాటు పరాయి పాలనలో మ్రగ్గడానికి    హిందూ సమాజం యొక్క అనైక్యతే కారణమని గుర్తించిన డాక్టర్జీ వ్యక్తులలో సంస్కారాలను, దేశభక్తిని నింపడానికి సంఘ శాఖను ప్రారంభించారన్నారు. ప్రతి రోజూ శారీరిక, బౌద్ధిక అంశాల సాధన ద్వారా వ్యక్తులలో స్వార్ధం నశించి నేను యావత్సమాజంలో భాగాన్ని, నేనూ సమాజం వేరు కాదు అన్న భావనను నిర్మించారని తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా, దూరంగా వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా సంఘం పనిచేసేలా డాక్టర్జీ సంఘాన్ని రూపొందించారని తెలిపారు. రాజ్యాధికారం ద్వారా కాక, వ్యక్తిలో స్వార్ధ రాహిత్యం, ఉన్నత వ్యక్తిత్వం, దేశ భక్తి నిర్మాణమవడం ద్వారానే శ్రేష్ఠ సమాజం నిర్మితమవుతుందని డాక్టర్జీ నమ్మి, ఆచరించి, సాధ్యం చేసి చూపారన్నారు.

94 సంవత్సరాల సంఘ కృషి కారణంగా దత్తోపంత్ ఠేంగ్డేజీ, దీనదయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశముఖ్ వంటి ఋషితుల్యులైన వ్యక్తుల నిర్మాణం జరిగిందని, వారందరూ దేశంలోని వివిధ రంగాలలోమార్పు కోసం కృషి చేసి సఫలురయ్యారని పేర్కొన్నారు. పరివర్తనే సంఘానికి పరమ మంత్రమని తెలిపారు.

అనంతరం ఆ శాఖా స్వయంసేవకుల శారీరిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.