
లష్కరే తోయిబాకి చెందిన ఓ ఉగ్రవాదిని జమ్మూలోని బారాముల్లా జిల్లాల్లో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. జింద్‌పాల్ సహా ఉత్తర కశ్మీర్‌లోని తంగ్‌మార్గ్ జిల్లా పరిసర ప్రాంతాల్లో చేపట్టిన కార్డన్ సెర్చ్ సందర్భంగా అతడు పట్టుబడినట్టు స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. జింద్‌పాల్‌లో పోలీసుల గాలింపు జరుగుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడని… అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయేందుకు ప్రయత్నించాడని ఆయన తెలిపారు. అతడిని వెంటాడి పట్టుకున్న పోలీసులు పేలడానికి సిద్ధంగా ఉన్న ఓ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని జింద్‌పాల్‌కు చెందిన ఫిర్దోస్ ఖాన్‌గా గుర్తించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.





