
పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయంలో పాకిస్థాన్, చైనాలకు ఎదురుదెబ్బ తగిలింది. కరుడుగట్టిన ఉగ్రవాది, జైష్-ఏ-మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చేందుకు అగ్రరాజ్యం అమెరికా చర్యలు మొదలు పెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని సిద్ధం చేసి 15సభ్య దేశాలకు కాపీలను అందజేసింది. దీనిలో మసూద్‌పై ఆంక్షలు విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొన్నారు.
సభ్యదేశాలకు తీర్మానం కాపీ:
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు సహకరించాలని అమెరికా భద్రతా మండలిలోని 15 సభ్యదేశాలను కోరింది. ఈ మేరకు బ్రిటన్, ఫ్రాన్స్ సంతకం చేసిన తీర్మానాన్ని ఆయా దేశాలకు అందజేసింది. అజర్‌పై ట్రావెల్ బ్యాన్ విధించాలని, అతని ఆస్తులను స్తంభింపజేయాలని కోరింది.
తీర్మానాన్ని అడ్డుకుంటున్న చైనా:
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరిలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీకి ప్రతిపాదించాయి. అయితే ఇందులోని కొన్ని అంశాలను సాకుగా చూపుతూ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగుసార్లు అడ్డుకుంది. దీంతో ఈసారి కచ్చితంగా అజర్‌పై నిషేధం విధించేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
షరతులు విధిస్తున్న పాక్:
ఇదిలా ఉంటే ఉగ్రవాదం విషయంలో పాక్ మరోసారి తన బుద్ధి బయటపెట్టుకుంది. మసూద్ అజర్‌ను కొన్ని షరతులపై అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి అంగీకరించాలని చైనాకు సూచించింది. భారత్ – పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గేలా భారత్ చర్యలు తీసుకోవడం, పాక్‌తో వెంటనే ద్వైపాక్షిక చర్చల్ని పునరుద్ధరించడం తదితర షరతులకు అంగీకరించాలని చెప్పింది. పాక్ షరతులను చైనా ఇప్పటికే అగ్రరాజ్యంతో పాటు భారత దౌత్యవేత్తలకు తెలిపింది. అయితే పాక్ చర్యలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి, భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు ఎలాంటి సంబంధంలేదని అమెరికా తేల్చిచెప్పింది.





