
ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మన శాస్త్రవేత్తలు ఎల్ఈవో ఉపగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. సుమారు 300 కిలోమీట్లర ఎత్తులో ఆ పేల్చివేత చోటుచేసుకుందన్నారు. కొన్ని నిమిషాల క్రితమే ఆ ఘటన జరిగిందన్నారు. యాంటీ శాటిలైట్ ఏ శ్యాట్ ద్వారా ఎల్ఈవో(లోయర్ ఎర్త్ ఆర్బిట్ ) ఉపగ్రహాన్ని కొట్టిపారేశారన్నారు. కేవలం 3 నిమిషాల్లో దీన్ని పూర్తి చేశారు. మిషన్ శక్తి అత్యంత కఠినమైందన్నారు. దీనికి ఎంతో టెక్నిక్ అవసరమని, కానీ శాస్త్రవేత్తలు దీన్ని సమర్ధంగా చేశారన్నారు. భారత పరాక్రమాన్ని చాటారన్నారు. మిషన్ శక్తిలో ఉన్న ప్రతి డీఆర్‌డీవో శాస్త్రవేత్తకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ గౌరవాన్ని శాస్త్రవేత్తలు పెంచారని, వారి పట్ల గర్వంగా ఉందన్నారు.
అంతరిక్షం ఇప్పడో జీవనశైలిగా మారిందని.. యాంటీ శాటిలైట్ దేశానికి కొత్త బలాన్ని ఇస్తుందన్నారు. విశ్వదేశాలకు ఈ విషయాన్ని చెప్పాలని ఉందన్నారు. ఆధునిక టెక్నాలజీని దేశ ప్రజల సురక్ష కోసం వాడనున్నట్లు ఆయన చెప్పారు. మిషన్ శక్తితో అంతరిక్ష నియమాలను పాటిస్తుందన్నారు. సురక్షితమైన, సమృద్ధిమైన, శాంతిపూర్వక దేశాన్ని నిర్మిస్తామన్నారు. భవిష్యత్తు లక్ష్యాలను అందుకునేందుకు ఆధునిక టెక్నాలజీని ఆహ్వానించాల్సిన అవసరం ఉందన్నారు. అంతరిక్ష శక్తిగా భారత్‌కు గుర్తింపు ఉందని, అమెరికా, రష్యా, చైనా సరసన ఇప్పుడు దేశం నిలిచిందన్నారు. ప్రతి భారతీయుడికి ఇంతకన్నా గర్వకారణం ఏదీ లేదన్నారు.
భారత శాస్త్రవేత్తలకు వందనం – ఆరెస్సెస్:
ఈ అద్భుత విజయానికి కారకులైన మన శాస్త్రవేత్తలకు ఆరెస్సెస్ శాల్యూట్ చేస్తున్నట్టు తెలిపింది. ఆ విధంగా ఆరెస్సెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ నాయకత్వానికి, భారత ప్రజానీకానికి కూడా తమ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఆరెస్సెస్ పేర్కొంది. ఈ అద్భుత విజయం భావి తరాలకు సైతం స్ఫూర్తినిస్తుందని ఆరెస్సెస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.





