ArticlesNews

జాతీయ పతాక నిర్మాత శ్రీ పింగళి వెంకయ్య

45views

న దేశం ఆంగ్లేయుల కబంద హస్తాలలో నలిగిపోతున్న కాలంలోనే ఆయన స్వేచ్ఛా భారతాన్ని స్వప్నించాడు. స్వతంత్ర భారతావని స్వరూపాన్ని ఊహించాడు. మన దేశానికి ఒక జాతీయ పతాక ఉండాలని కాంక్షించాడు. ఎలా ఉంటే బాగుంటుందో పరిశోధించాడు. ఎందరో పెద్దలతో చర్చించాడు. అందరికీ ఆమోదయోగ్యమైన, మన దేశ పరిస్థితులకు తగిన రీతిలో మువ్వన్నెల జెండాను రూపొందించి జాతికందించాడు. ఆయనే మన పింగళి వెంకయ్య.

బాల్యం, విద్యాభ్యాసం

పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు 1876 ఆగష్టు 2న జన్మించాడు. తండ్రి దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణంగా ఉండేవాడు. వెంకయ్య గారి తాత అడివి వెంకటాచలం చల్లపల్లి సంస్థానం ఠాణేదారు.

తాతగారికి పెదకళ్ళేపల్లికి బదిలీ కావటం వల్ల వెంకయ్య ప్రాథమిక విద్య అక్కడే పూర్తయింది. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లిలోనూ, మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయటానికి కొలంబో  వెళ్లాడు. వెంకయ్య తన 19వ ఏటనే బొంబాయి వెళ్ళి, సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలోని రెండవ బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ సమయంలోనే మహాత్మా గాంధీని కలిశాడు. కొద్దిపాటి పరిచయంలోనే ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశం తిరిగి వస్తూ అరేబియా, ఆప్ఘనిస్థాన్ లను సందర్శించి వచ్చాడు.

మన దేశంలో అప్పటికి ప్లేగు వ్యాధి అధికంగా ప్రబలి ఉంది. దేశ ప్రజలను ప్లేగు నుంచి రక్షించాలనే ఉద్దేశ్యంతో మద్రాసులో ఫ్లేగు ఇనస్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్లారిలో ప్లేగు ఇనస్పెక్టరుగా పనిచేశాడు. అతని జ్ఞాన దాహం అంతులేనిది. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేశాడు. అనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఎ.వి. కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించాడు.

జపాన్ వెంకయ్య

1904 లో రష్యా, జపాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో జపాన్, రష్యాను ఓడించింది. రష్యా వంటి పెద్ద దేశాన్ని, జపాన్ వంటి చిన్న దేశం ఓడించగలగటం వెంకయ్యను ఆశ్చర్యపరచింది. దాంతో ప్రొఫెసర్ గోటే ఆధ్వర్యంలో జపాన్ భాష, చరిత్ర, సంస్కృతులపై విస్తృత అధ్యయనం చేశారు. జపనీస్ భాషపై మంచి పట్టు సంపాదించారు. 1913లో ఒక సందర్భంలో బాపట్లలో జరిగిన సభలో పింగళి వెంకయ్య జపాన్‌ భాషలో ప్రసంగించవలసి వచ్చింది. అప్పటినుంచి ఆయన ‘జపాన్‌ వెంకయ్య’ గా కీర్తి గడించారు.

పత్తి వెంకయ్య

సహజంగానే దేశభక్తుడైన వెంకయ్య 1906లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో పాల్గొన్నారు. అక్కడ కలిసిన మునగాల రాజా బహదూర్ నాయని రంగారావు గారి ఆహ్వానం మేరకు వారి ఆస్థానంలో ఉంటూ వ్యవసాయంపై పరిశోధనలు చేసి “వ్యవసాయ శాస్త్రం” అనే గ్రంథాన్ని వెలువరించారు. ఆ సమయంలోనే సన్న నూలునిచ్చే ‘కంబోడియా పత్తి’ అనే ఒక ప్రత్యేకమైన పత్తి మీద విశేష కృషి చేసి ఆ పత్తిని పండించారు. ఆయన కృషిని లండన్ లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ వారు గుర్తించి సభ్యత్వం ఇచ్చి గౌరవించారు. దాంతో ఆయనకు ‘పత్తి వెంకయ్య’ అనే పేరొచ్చింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి

మునగాల రాజావారి పరగణాలోని నడిగూడెంలో ఉన్నప్పుడే వీరి ప్రతిభను గుర్తించిన శ్రీ ముట్నూరి కృష్ణారావు, కోపెల్ల హనుమంతరావులు వెంకయ్యను బందరులోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా నియమించుకున్నారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. అప్పట్లోనే చైనా జాతీయ నాయకుడైన ‘సన్ యత్ సేన్ ‘ జీవిత చరిత్ర వ్రాశారు. ఆ గ్రంథ రచన కోసం ఆయన చేసిన అధ్యయనం ఆధారంగా చైనా మన దేశంపై దండయాత్ర చేస్తుందని, దలైలామా మన దేశంలో ఆశ్రయం పొందుతారని ఆయన ఆనాడే జోస్యం చెప్పారు.

జెండా వెంకయ్య

1906లో కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్నప్పుడు “ఒకవైపు మనం ఇంగ్లీషు వారిని దేశం విడచి వెళ్ళమని చెబుతూనే… వారి యూనియన్ జాక్ జెండానే ఉపయోగించడం ఎంతవరకు సబబు?” అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. మనకంటూ ఒక జెండా వుండాలని ఘోషించారు.

ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే అభిమాన విషయంగా పెట్టుకొని, దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు.1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికీ హాజరై, నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపారు. 1916లో “భారతదేశానికొక జాతీయ జెండా ” అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో వ్రాసి ప్రచురించారు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక వ్రాశారు.

పింగళి వెంకయ్య 1916 నుంచి 1921 వరకు జాతీయ జెండాపై ఎంతో పరిశోధన చేశారు. 30 దేశాల పతాకాలను సేకరించారు. 1918 వ సంవత్సరం మొదలు, 1921 వరకు జరిగిన అన్ని కాంగ్రెస్‌ సమావేశాలలో వెంకయ్య జెండా ప్రస్తావన తీసుకువస్తూనే ఉన్నారు. ఆఖరికి కాకినాడ కాంగ్రెస్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు (1921 మార్చి 31) తొలిసారి ఆయన ఆశ నెరవేరింది. అంతకు ముందు కలకత్తా సమావేశాల సందర్భంగా ఒక పతాకం తయారయింది. దానిని ఆ నగరంలో బగాన్‌ పార్సీ పార్కు దగ్గర ఎగురవేశారు కూడా. దానిని ‘కలకత్తా జెండా’ అనేవారు. అప్పటి నుంచి ఆయనను “జెండా వెంకయ్య” అని పిలిచేవారు.

1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో కూడా వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దానికి అంగీకరించారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరారు. గాంధీజీ సూచనల మేరకు ఒక జెండాను సమకూర్చారు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి మధ్యలో రాట్నం ఉన్న త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.

‘మన జాతీయ పతాకం’ పేరుతో యంగ్‌ ఇండియా పత్రికలో గాంధీజీ వ్రాసిన మాటలు ప్రత్యేకమైనవి. ‘‘మన జాతీయ జెండా కోసం త్యాగం చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేస్తున్న (అప్పటికి పింగళి అక్కడ అధ్యాపకుడు) పింగళి వెంకయ్య ఒక పుస్తకం ప్రచురించారు. అందులో వివిధ దేశాల జెండాల నమూనాలు ఉన్నాయి. అలాగే మన జాతీయ పతాకం నమూనా ఎలా ఉండాలో కూడా ఆయన సూచించారు. జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్‌ సభలలో ఆయన పడిన శ్రమ, తపనలను నేను అభినందిస్తున్నాను. నేను విజయవాడ వెళ్లినప్పుడు ఆకుపచ్చ, కాషాయం రంగులతో పతాకాన్ని రూపొందించవలసిందని వెంకయ్యగారికి సూచించాను. పతాకం మధ్యలో అశోకుని ధర్మచక్రం ఉండాలని కూడా సూచించాను. మరో మూడు గంటలలోనే వెంకయ్యగారు పతాకం తెచ్చి ఇచ్చారు. తరువాత తెలుపు రంగు కూడా చేర్చాలని భావించాం. ఎందుకంటే ఆ రంగు మన సత్య సంధతకీ, అహింసకీ ప్రతీకగా ఉంటుంది.’’ అని గాంధీజీ తన పత్రికలో రాశారు.

వెంకయ్య నడిగూడెంలో మునగాల రాజావారి సంస్థానంలో ఉన్న సమయంలోనే మధ్యలో రాట్నం ఉన్న త్రివర్ణ పతాకాన్ని రూపొందించి స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీలలో బెజవాడలోని కాంగ్రెస్ మహాసభలో సమర్పించారు.

త్రివర్ణ పతాక ఆవిష్కరణ

1947, జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ, జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ పతాకంలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన  త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది.

‘డైమండ్’ వెంకయ్య

జియాలజీలో పట్టభద్రుడైన పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లో వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించారు. అందుకే ఆయనను ‘డైమండ్ వెంకయ్య’ అని పిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు వ్రాశారు. ఈ విషయంలో ఆయన భారత ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు. జాతిరత్నాలు, వాటిని పోలి ఉండే రాళ్లు దేశంలో చాలా చోట్ల దొరుకుతాయని ఆయన చెప్పేవారు. 1924 నుండి 1944 వరకు నెల్లూరులోనే ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశారు. భూగర్భశాస్త్రం అంటే ఆయనకు అపారమైన ప్రేమ. ఆ అంశంలో పీహెచ్డీ కూడా చేశారు. దీంతో పాటు నవరత్నాల మీద కూడా అధ్యయనం చేశారు. వజ్రకరూరు, హంపిలలో ఖనిజాలు, వజ్రాల గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ‘‘వజ్రపుతల్లి రాయి’’ అనే గ్రంథం వ్రాసి 1955లో దాన్ని ప్రచురించారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేశారు. అప్పటికి ఆయన వయస్సు 82 సంవత్సరాలు.

అంత్యకాలంలో అంతులేని బాధలు

వృద్ధాప్యంలో ఆయనను ఆర్థిక బాధలు చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో చిన్న గుడిసె వేసుకొని అంత్యకాలంలో దయనీయమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, భారత పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, పింగళి వెంకయ్య పేరుని సూచించకపోవడం విచారకరం.

జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడ్డారు. అంతిమదశలో విజయవాడలో కె.ఎల్.రావు, టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సత్కరించి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం అందుకున్న తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4 న శ్రీ పింగళి వెంకయ్య దివంగతులయ్యారు.

కన్నుమూసేముందు ఆయన తన చివరి కోరికను వెల్లడిస్తూ ” నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇదే నా తుది కోరిక ” అన్నారు.

ఈ భూమిపైన మన జాతీయ పతాకం ఎగురుతుండేవరకూ స్మరించుకోదగిన ధన్యజీవి శ్రీ పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి ఆయన. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై అతని కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రజలకు ఆయన దర్శన భాగ్యాన్ని కలిగించింది.

కుమార్తెకు సత్కారం…

వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకు పరశురాం ఇండియన్ ఎక్స్ ‌ప్రెస్ లో జర్నలిస్టుగా పనిచేశాడు. రెండవ కుమారుడు చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్నవయసులోనే మరణించాడు. కూతురు సీతామహాలక్ష్మి మాచర్లలో నివసిస్తోంది.

రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగే “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న దివంగత వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్మానించారు. సీతామహాలక్ష్మికి “ఆజాదీ కా అమృత్ మహోత్సవం” సందర్బంగా ముఖ్యమంత్రి  75 లక్షలు అందజేశారు. భారత జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్యకు ‘భారతరత్న’ను అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి లేఖ వ్రాశారు.

ఏ జాతికైనా చిహ్నం ఆ జాతి జెండా. ఆ జెండానే ఆ జాతి గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు, మౌన సాక్షి. జాతి ఘనతను ఎలుగెత్తి చాటే జాతి వైభవ గీతి ఆ జాతి జెండా. జాతి గమనానికి నిత్య ప్రేరణా స్ఫూర్తి, దివ్య దీప్తి జాతీయ జెండా. ఏ జాతీయుడికైనా తమ జాతీయ పతాక ఒక గర్వకారణం. జెండా గౌరవం తమ జాతి గౌరవం, తన గౌరవం. జెండాకు అవమానం తన జాతికి అవమానం, తనకు అవమానం. అలాంటి జాతీయ జెండాని, మన భారత జాతీయ జెండాని, మన మువ్వన్నెల జెండాని రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య చిరస్మరణీయుడు, నిత్యస్మరణీయుడు. భారత్ మాతాకీ జయ్.

* ఆ నిష్కళంక దేశభక్తుని జయంతి నేడు.

– శ్రీరాంసాగర్