News

దిశ మార్చుకున్న ‘అసని’ 

307views

* కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోన్న తుఫాను

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

మరోవైపు ‘అసని’ తీవ్ర తుపాను కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో విమానాలను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఎయిర్ ఏషియాకు చెందిన దిల్లీ- విశాఖ, బెంగళూరు- విశాఖ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన ముంబయి- రాయపూర్‌- విశాఖ, దిల్లీ- విశాఖ విమానాలు రద్దయ్యాయి. తుపాను నేపథ్యంలో తీవ్ర గాలుల వల్ల ముందు జాగ్రత్త చర్యగా తమ సర్వీసులను రద్దు చేసినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి.

తెలంగాణలోనూ వర్షాలు..

తుపాను ప్రభావం తెలంగాణపైనా పడే అవకాశముంది. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

తుపాను దృష్ట్యా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడిన హోం మంత్రి.. ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను దృష్ట్యా అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.