* దావూద్ అనుచరుల ఇళ్లల్లో సోదాలు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి హవాలా ముఠా వ్యవహారాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ ముమ్మరం చేసింది.
ముంబయిలోని అతడి అనుచరుల ఇళ్లపై దాడులు చేపట్టింది. దావూద్ కోసం ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ముంబయిలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. బాంద్రా, బోరివలి, గోరేగావ్, పరేల్, శాంటాక్రూజ్ తదితర ప్రాంతాల్లో దావూద్ కంపెనీకి చెందిన హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగ్లర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు జరిపింది.
దావూద్ కు చెందిన డీ-కంపెనీ హవాలా ఆపరేటర్లు, కీలక వ్యక్తులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఉగ్ర కార్యకలాపాల ద్వారా భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఈ దాడుల నిమిత్తం దావూద్ ఓ ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ మధ్య నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే దావూద్ అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతేగాక, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కు డీ-కంపెనీతో ఉన్న సంబంధాలు, దావూద్ కుటుంబసభ్యులతో మాలిక్ కు పరిచయాలున్నాయన్న ఆరోపణలపైనా ఎన్‌ఐఏ విచారణ జరుపుతోంది. ఈ దాడుల్లో భాగంగా దావూద్ అనుచరుడు సలీమ్ ఫ్రూట్ ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.