
* రక్షణ సిబ్బందికి ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్వేర్ చొప్పించే పన్నాగం
రక్షణ శాఖ సిబ్బంది ఉపయోగించే కంప్యూటర్లు, ఫోన్లు, ఇతర పరికరాల్లోకి ఓ మాల్‌వేర్‌ను చొప్పించేందుకు పాకిస్థానీ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తప్పుడు పేరుతో సృష్టించిన ఫేస్‌బుక్ ఖాతాపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభమైంది. డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, వాటికి అనుబంధ డిపార్ట్‌మెంట్లలో పని చేసే సిబ్బంది ఉపయోగించే పరికరాల్లో ఈ మాల్‌వేర్ ను చొప్పించి, మన దేశ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని దొంగిలించేందుకు ఐఎస్ఐ ఈ ఖాతాను సృష్టించింది. పాక్ ఐఎస్ఐ fb.com/shaanti.patel.89737 పేరుతో ఓ ఖాతాను సృష్టించింది. దీనిని చూసినవారు ఇది శాంతి పటేల్ ఫేస్‌బుక్ ఖాతా అని భ్రమించేలా చేసింది. కంప్యూటర్ రిసోర్సెస్ లోని ఇతరులకు అనుమతి లేని సమాచారాన్ని అనధికారికంగా పొందడం కోసం ఈ ఖాతాను సృష్టించింది.
ఫేస్‌బుక్, ఇతర యాప్‌లను ఉపయోగించి కీలక సమాచారం లీక్ అవుతుండటం గురించి 2020 జూన్‌లో మొదటిసారి వెలుగులోకి వచ్చింది. సోర్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. ఇటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో భారత సైన్యం 2020 జూలై 9న తన అధికారులు, సిబ్బందికి కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ సహా 89 సోషల్ నెట్‌వర్కింగ్, మైక్రోబ్లాగింగ్, గేమింగ్ యాప్‌లను తమ డివైసెస్ నుంచి తొలగించాలని ఆదేశించింది.
ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన కేసు ప్రాతిపదికపై NIA ఈ దర్యాప్తును చేపట్టింది. ఈ కేసులో జాతీయ, అంతర్జాతీయ ప్రమేయాల గురించి దర్యాప్తు చేసింది. దొంగతనానికి గురైన సమాచారం వల్ల దేశ భద్రతకు కలగబోయే పరిణామాల గురించి పరిశీలిస్తుంది. అధికార రహస్యాల చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ఈ దర్యాప్తును నిర్వహిస్తోంది. ISI కోసం పని చేసినట్లు అనుమానించదగిన వ్యక్తులకు ఈ సున్నితమైన సమాచారం చేరిందా? దానివల్ల భారత దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర జరుగుతోందా? అనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. డిఫెన్స్ సిబ్బంది ఉపయోగించే డివైసెస్‌లోకి ఇన్‌స్టాల్ అయిన మాల్‌వేర్ వల్ల ఎటువంటి సమాచారం బయటకు పొక్కిందనే విషయం ఇంకా తెలియడం లేదు.
ఐఎస్ఐ హ్యాకర్లు భారత రక్షణ సిబ్బందితో శాంతి పటేల్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పరిచయం చేసుకున్నారు. అనంతరం ఓ ప్రైవేటు మెసెంజర్ చాట్ ద్వారా సంభాషణలు జరిపారు. మహిళల ఆకర్షణీయమైన ఫొటోలను సాకుగా చూపి ఈ మాల్‌వేర్‌ను వ్యాపింపజేశారు. ఈ మాల్‌వేర్ ను పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ నుంచి వ్యాపింపజేసినట్లు వెల్లడైంది.