News

అంతర్జాతీయ వేదికపై భారత సినిమాలకు అరుదైన గౌరవం

460views
  • కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నభారత చిత్రాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సినీ వేదిక ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌’ వజ్రోత్సవంలో భారత్​కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే.. భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్‌లో అధికారిక దేశం హోదా కల్పించగా.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. భారత దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన ‘ప్రతిధ్వని’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

అంతేకాకుండా.. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ ప్రీమియర్​ షోను కేన్స్​ వేదికపై ఈ నెల 19న ప్రదర్శించబోతున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’లో మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో పాన్‌ఇండియా చిత్రంగా రూపొందింది. జులై 1న ఈ సినిమా విడుదల కానుంది. సిమ్రన్‌ కథానాయిక. సామ్‌ సీఎస్‌ స్వరాలందిస్తున్నారు.

సినిమా పరంగా చూసుకుంటే.. అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఈ క్రమంలో భారత్​ నుంచి ‘ప్రతిధ్వని’, ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’తో పాటు మరో నాలుగు సినిమాలను ప్రదర్శించే అవకాశం వచ్చింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు నిర్వహించనున్న మార్చే డు ఫిల్మ్‌లో కూడా అధికారిక గుర్తింపు లభించినట్టు అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి