News

చైనా సరిహద్దుల్లో డ్రోన్ నిఘా

404views

రుణాచల్‌ ప్రదేశ్ ‌లోని చైనా సరిహద్దు వద్ద భారత సైన్యం నిఘా వ్యవస్థను పటిష్ఠపరిచింది. రాత్రింబవళ్లు రిమోట్‌ కంట్రోల్ ‌తో పనిచేసే డ్రోన్లు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో ఇజ్రాయెల్ ‌లో తయారు చేసిన మధ్యస్థాయి ఎత్తులో ఎగిరే దీర్ఘకాలిక సామర్థ్యం కలిగిన హెరాన్‌ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇవి 35వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఏకబిగిన 45 గంటల పాటు పనిచేస్తాయి. వీటిని ఉపగ్రహ కమ్యూనికేషన్‌ వ్యవస్థతో అనుసంధానం చేయడంతో వెంటవెంటనే సమాచారం అందుతుంది.

గత ఏడాది లడ్డాఖ్ ‌లో చైనా బలగాలు ప్రవేశించిన దగ్గర నుంచి మొత్తం 3,400 కి.మీ. మేర ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద గస్తీ ముమ్మరమయింది. కీలక, వ్యూహాత్మక ప్రాంతాల్లో వేగవంతంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎలాంటి దుస్సాహసం చేయకుండా చైనాను నిరోధించేందుకు నిఘాను పెంచారు.

డ్రోన్లు కాకుండా అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ అయిన ‘రుద్ర’ను కూడా సైన్యం మోహరించింది. ఇది ఆయుధాలను తీసుకువెళ్లే వెపన్‌ సిస్టం ఇంటిగ్రేటెడ్‌ (డబ్ల్యూఎస్‌ఐ) తరహావి కావడం గమనార్హం. సైన్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైమానిక విభాగం వీటన్నింటినీ పర్యవేక్షిస్తోంది. వాస్తవానికి హెరాన్‌ డ్రోన్లను ఇక్కడ నాలుగయిదేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు.

అయితే ‘నిఘా నుంచి కాల్చడం వరకు’ (సెన్సార్‌ టు షూటర్‌) అన్న విధానం మేరకు వీటిని ఇతర నిఘా వ్యవస్థలతో అనుసంధానం చేశారు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురయినప్పుడు అతి తక్కువ సమయంలోనే బలగాలను మోహరించగలగడం ఈ విధానం ప్రత్యేకత. ఎత్తయిన ప్రదేశాలకు ఆయుధాలను తీసుకెళ్లే రుద్ర హెలికాప్టర్లు ఉండడం సైన్యానికి ఎంతగానే ఉపయోగకరంగా మారింది. గత ఏడాదితో పోల్చితే మరింత మెరుగైన పరిస్థితిలో ఉన్నామని ఓ అధికారి చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.