ArticlesNewsProgramms

సనాతన ధర్మ పరిరక్షణకై సాధుసంతుల సమాలోచన

718views

ఫిబ్రవరి 3 బుధవారం తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే పలువురు ధర్మాచార్యులు ఇందులో పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని , హిందూ మతాన్ని , హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసే విధంగా పరిస్థితి విషమిస్తున్న తరుణంలో ఐక్య కార్యాచరణకు పటిష్ఠ, విశాల వేదికను రూపొందించేందుకు ఉద్దేశించిన సమాలోచనల పరంపరలో ఇది మొదటిది . అందుబాటులో ఉండి , వెంటనే కలిసేందుకు అంగీకరించిన కొద్దిమంది ప్రసిద్ధ పీఠాధిపతులతో తొలి సమావేశం జరిగింది.

ఇందులో పాల్గొన్న వారిలో ఈ కింది ప్రముఖులు ఉన్నారు:

1. కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామి వారు.
2. శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రతినిధిగా శృంగేరి శారదా పీఠం ఎడ్మినిస్ట్రేటర్ శ్రీ గౌరీశంకర్ గారు.
3. పెజావర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వ ప్రసన్న తీర్థ మహాస్వామివారు
4.హంపి విద్యారణ్య మహా సంస్థాన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామివారు.
5 పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామివారు
6. తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు.
7. అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీవన్ శఠకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదశికన్ మహాస్వామి వారి ప్రతినిధి
8. శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి మహాస్వామివారు
9. శ్రీ ముముక్షుజన మహా పీఠాధిపతి ముత్తీవి సీతారాం గురువర్యులు ఈ ధార్మిక సదస్సులో పాల్గొన్నారు.

దక్షిణాదిలో సనాతన ధర్మంపై ముప్పేట దాడి :

ఆరు గంటలకు పైగా సాగిన ఈ ఆత్మీయ సమాలోచనలో అనేక ధార్మిక విషయాలపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా దక్షిణాదిన కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో సనాతన ధర్మం, హిందూ సంస్కృతి, హిందువుల విశ్వాసాల మీద వివిధ దిశలలో జరుగుతున్న దాడులపై సదస్సు ఆవేదనను వ్యక్తం చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఆగని దేవతామూర్తుల విధ్వంసం :

“ఆంధ్ర ప్రదేశ్ లో పూర్వపు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాలయాలను తొలగించిన తీరును రాష్ట్ర ప్రజలు మరచి పోలేదు. ముఖ్యంగా ఇటీవల ఒక సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, ఆవేదనను కలిగిస్తున్నాయి. దేవాలయ వ్యవస్థ మీద , పవిత్ర దేవతామూర్తుల మీద ఆంధ్రప్రదేశ్ లో పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. అయోధ్యలోని రామజన్మభూమిలో ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడికి దివ్యమైన గుడి కట్టేందుకు మొత్తం హిందూ సమాజం దీక్షాబద్ధమైన సమయాన రాముడు నడయాడిన పుణ్యభూమిలో రాములవారి విగ్రహానికి శిరశ్ఛేదం చేసే దారుణానికి తెగబడటం సహించరాని, క్షమించరాని దురాగతం. అటువంటి దుష్కృత్యాలకు పాల్పడిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దండించాలి” అని సదస్సు అభిప్రాయపడింది.

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవస్థానాల పరిసరాలలో , దేవాలయ ప్రాంగణాలలో అన్య మత ప్రచారాలు, అన్యమత చిహ్నాల ప్రదర్శనలు నిరాఘాటంగా సాగుతున్నాయి. తిరుమల, శ్రీశైలం, సింహాచలం వంటి పవిత్ర పుణ్య క్షేత్రాలలో అన్య మతస్తుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. మైనారిటీల మెప్పు కోసం హిందూ దేవాలయాల సొమ్ము విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతున్నది. హిందూ దేవస్థానాల పరిపాలనలో హైందవేతరుల, హిందూ మత వ్యతిరేకుల పెత్తనం పెరిగింది. అనుచిత ప్రలోభాలతో, ఒత్తిళ్ళతో అక్రమ మతాంతరీకరణలు ముమ్మరమయ్యాయి. మతమార్పిడులు రాష్ట్రమంతటా బాహాటంగా చట్ట విరుద్ధంగా సాగుతున్నాయని ఎందరు ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగం లక్ష్య పెట్టటంలేదు.

“దేవాలయ వ్యవస్థను రక్షించటం, దైవాపచారాలకు పాల్పడే దుండగులను కఠినంగా శిక్షించటం ఫ్రభుత్వ ధర్మం. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మాచార్యులు తమకేమీ పట్టనట్టు మిన్నకుండజాలరు . రాజ్యాంగాన్ని అపహసించి , ఒక మతం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ హిందూ మతాన్ని మట్టుపెట్టే వినాశకర ధోరణిని ప్రస్తుత పాలకులు తక్షణం విడనాడాలి ” అని పూజ్య ధర్మాచార్యులు హితవు చెప్పారు.

“ఇటీవలి కాలంలో హైందవ దేవాలయ వ్యవస్థపై , దేవతా మూర్తులపై , హైందవ మత విశ్వాసాలపై , హిందువుల సెంటిమెంట్లపై జరిగిన దుర్మార్గపు దాడులకు, విధ్వంసాలకు , తీరని అపచారాలకు బాధ్యులైన కర్తలను, కారకులను, వారిని ప్రేరేపించిన వారిని వెంటనే గుర్తించి, శిక్షించేందుకు ప్రభుత్వం సత్వరం కదలాలి. అది పాలకులకే క్షేమం .” అని ధర్మాచార్యులు ప్రభుత్వానికి కర్తవ్య బోధ చేశారు.

దేవాలయాల నిధులను ధార్మికేతర కార్యక్రమాలకు మళ్ళించరాదు :

దేవాలయాల నిధులలో ఒక్క పైసా కూడా హిందూ ధర్మంతో సంబంధం లేని సెక్యులర్ అవసరాలకు, సంక్షేమ పథకాలకు మళ్ళించకూడదు. ఆయా దేవాలయాల అభివృద్ధి, ధర్మ ప్రచారానికీ మాత్రమే ఆలయ నిధులు వెచ్చించాలి.

ఉన్నత స్థాయి కమిటీ :

దేవాలయ వ్యవస్థ పై ప్రభుత్వ నియంత్రణ, దేవదాయ ధర్మదాయ శాఖ పనితీరు, దేవుడి అస్తుల , ఆభరణాల భద్రత , అర్చకుల సంక్షేమం , భక్తుల సౌకర్యాలు వంటి అనేక అంశాలకు సంబంధించి ఉత్పన్నమైన వివాదాలను, అభియోగాలను , విజ్ఞుల సూచనలను సాకల్యంగా అధ్యయనం చేసి పరిస్థితిని చక్కదిద్దే మార్గాన్ని సూచించేందుకు రిటైర్డ్ న్యాయముర్తి ఆధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలి. పీఠాధిపతులు, విజ్ణుల సలహాలతో వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆ కమిటీలో సభ్యులుగా నియమించాలి.

దేవాలయ కేంద్రంగా భక్త సంఘాలు:

దేవాలయ ఆస్తుల , సంప్రదాయాల , ఆచారాల పరిరక్షణ నిమిత్తం దేవాలయాలలో భక్త సంఘాలు ఏర్పడాలి.

ఆర్కియలాజికల్ పరిధిలోని ప్రాచీన దేవాలయాల్లో పూజలకు అనుమతులు:

” అలాగే -దేశ వ్యాప్తంగా అనేక ప్రాచీన దేవాలయాల్లో ఆర్కియలాజికల్ విభాగపు ఏకపక్ష ధోరణి వల్ల ఆ దేవాలయాలలో దీప,ధూప నైవేద్యాలు లేకుండా పోయాయి.అధికారులు, ధర్మాచార్యులతో సంప్రదింపులు జరిపి గర్భ గృహంలో పూజలు జరుగునట్లు,ఆయా దేవాలయాల ప్రాచీనతను కాపాడడంలో ఆర్కియలాజికల్ వారి నియమాలను పాటించే విధంగా ఒక సమన్వయ మార్గాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించాలి.” అని ధర్మాచార్యులు సూచించారు.

అన్ని వైపులా దాడులతో సంక్షుభితమైన హిందూ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలి ? ఏ విధమైన దిశా నిర్దేశం చేయాలి ? సనాతన ధర్మరక్షణకు , హైందవ మత పరిరక్షణకు ఎటువంటి కార్యాచరణ నిర్దేశించాలి ? అందులో అన్ని మత శాఖలకు , సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యులను , ఆధ్యాత్మిక వేత్తలను , ధార్మిక ప్రముఖులను , ధార్మిక, మత సంస్థలను ఎలా నిమగ్నం చేయాలి ? సనాతన ధర్మ సంరక్షణకు , దుష్ట శిక్షణకు ఏ విధంగా ముందుకు సాగించాలి? అన్న అంశాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరిగింది.

తిరుపతిలో విస్తృత సాధుసంతుల సభ:

ఇటువంటి అతిముఖ్య అంశాలపై సమగ్ర సమాలోచన జరిపేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో వీలైనంత త్వరగా విస్తృత సమావేశాలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సంప్రదాయాలకు , వివిధ హైందవ మత శాఖలకు చెందిన సాధు సంతుల , పీఠాధిపతుల మహాసభను త్వరలో తిరుపతి లో జరపాలని ధర్మాచార్యులు నిర్ణయించారు.

దీర్ఘకాలిక ధర్మ పోరాటానికి తయారు కావాలి :

ప్రభుత్వాన్ని నడిపేవారు రాజ ధర్మాన్ని విస్మరించినప్పుడు ధర్మ సంరక్షణకు ప్రజలే ఆయత్తం కావాలి. సనాతన ధర్మాన్ని , హిందూ మతాన్ని కాపాడుకోవటానికి నిరంతరం జాగరూకత చూపాలి. హిందువులందరూ దీర్ఘ కాలిక ధర్మ పోరాటానికి సమైక్యంగా కదలాలి.

ధర్మాచార్యుల సంయుక్త పర్యటనలు :

ఈ దిశగా హిందూ సమాజాన్ని జాగృత పరచటానికి ధర్మాచార్యులు సంయుక్త పర్యటనలు జరపదలిచారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించబడుతాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.