News

రామతీర్థం గుడిలో ఖండిత విగ్రహాల తొలగింపుకు శ్రీకారం

468views

రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై ఉన్న కోదండరాముడి దేవాలయంలో ఖండిత విగ్రహాల తొలగింపు ప్రక్రియను సోమవారం చేపట్టనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కోదండరాముడి విగ్రహ శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ విగ్రహ పునఃప్రతిష్ఠకు చర్యలు చేపడుతున్నారు. ఈ పురాతన ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఉన్నచోట ప్రాయశ్చిత్త హోమాల నిర్వహణకు ద్వారకా తిరుమల నుంచి ఆగమ పాఠశాల ప్రధానాచార్యులు వంశీకృష్ణతో పాటు వేదపండితులు వస్తున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించాక విగ్రహాలను స్థానభ్రంశం చేస్తారు. అనంతరం వీటిని మరోచోట భద్రపరుస్తారు. తదుపరి బాలాలయం నిర్మాణానికి వేద పండితులతో మంచి ముహూర్తం నిర్ణయించేందుకు దేవదాయశాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు. నీలాచలం కొండపై కోదండరాముని ఆలయంలో హోమాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతుల కోసం ఎస్పీకి దరఖాస్తు చేసినట్లు ఇంచార్జి ఈవో రంగారావు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.