
పాకిస్తాన్‌లో పవర్‌గ్రిడ్ కుప్పకూలింది. రాజధాని ఇస్లామాబాద్‌తో సహా దాదాపు దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11:41 నిముషాలకు దక్షిణ పాకిస్థాన్‌లోని గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు ప్రాథమిక విచారణ నివేదిక చెబుతోంది.
ఈ సాంకేతిక అవరోధం ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ప్లాంట్లు వరుసగా మూతపడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా 21 కోట్ల మంది చీకట్లో మగ్గుతున్నారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్, ఆర్థిక రాజధాని కరాచీ, రెండో అదిపెద్ద నగరం లాహోర్‌తో సహా పలు పట్టణాలు చీకటిమయమయ్యాయి.
పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టామని.. దేశంలోకి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని పాక్ విద్యుత్తు శాఖ మంత్రి మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ అన్నారు. కరెంటు సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.