కాశ్మీర్ లో ఉగ్రవాదం తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాయే అతిపెద్ద సవాలు – జమ్మూ కాశ్మీర్ డీజీపీ వెల్లడి

పాక్ ముష్కరుల దుశ్చర్యల కారణంగా నిత్యం తూటా పేలుళ్లతో దద్ధరిల్లే జమ్మూకశ్మీర్ మరో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తర్వాత అతిపెద్ద సవాల్‌గా మాదకద్రవ్యాల అక్రమ రవాణా మారిందని ఆయన వెల్లడించారు. 2020లో జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1600 మందికి పైగా అనుమానిత డ్రగ్ వ్యాపారులను అరెస్టు చేసినట్టు తెలిపారు. గతేడాది మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా 1132 కేసులు నమోదు చేసి 1672మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వీరిలో 35మంది మాదకద్రవ్యాల వ్యాపారులపై ప్రజా సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
ఈ మాదకద్రవ్యాలు ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు దోహదంచేయడమే కాకుండా యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ వ్యాపారుల నుంచి 152.18కిలోల హెరాయిన్, 563.61 కిలోల గంజాయి, 22,230 కిలోల నల్లమందుతో పాటు మరికొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.





