కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో పూజారి, అతని కుమారులపై చర్నాకోలతో దాడి చేసిన ఆలయ ఛైర్మన్ పిట్టం ప్రతాప్‌రెడ్డి, ఇద్దరు ఒప్పంద ఉద్యోగులను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. పూజారి సుధాకరయ్య, అతని కుమారులు చక్రపాణి, మృగపాణిలపై సోమవారం ఆలయ ఛైర్మన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణులు భగ్గుమన్నారు. దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) వెంకటేశ్, సహాయ కమిషనరు ఆశిష్ నాయుడు ఈ ఘటనపై విచారణకు మంగళవారం ఓంకారం వచ్చారు.
ఆది శైవ బ్రాహ్మణ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుబ్బ సత్యనారాయణ శర్మ, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు మహేశ్వర శర్మ, రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు నందీశ్వర శర్మ, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు ల ఆధ్వర్యంలో ఆలయం బయట బైఠాయించారు. పిట్టం ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేసే వరకు అక్కడి నుంచి కదలమని ఆందోళనకారులు భీష్మించారు. ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా చర్యలపై ఏమీ తేల్చకుండా అధికారులు సాయంత్రం తిరుగుముఖం పట్టడంతో ఆలయ పూజారి సుధాకరయ్య, అతని కుమారులు ఆర్‌జేసీ కారుపైకి ఎక్కి నిరసన తెలిపారు. తమకు న్యాయం జరగకపోతే అక్కడే ఉరి వేసుకుంటామని హెచ్చరించారు.
ఒప్పంద ఉద్యోగులు నాగరాజు, ఈశ్వరయ్యలను సస్పెండ్ చేస్తున్నామని, పాలక మండలి రద్దు, ఈవో మోహన్ సస్పెన్షన్ విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. పిట్టం ప్రతాప్‌రెడ్డి, ఇద్దరు ఒప్పంద ఉద్యోగులు నాగరాజు, ఈశ్వరయ్యలను అరెస్టు చేసినట్లు ఎస్సై రాజారెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు. ఓంకారం ఆలయ ఛైర్మన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని సూచిస్తూ విచారణ కమిటీ దేవాదాయ కమిషనర్‌కు నివేదిక పంపింది.