News

కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన సాగాలి : ప్రధాని మోడీ

597views

పాఠశాలల్లో బోధన భాషపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీమరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాతృ భాషలోనే బోధించడం వల్ల విద్యార్థులు విషయాలను సులువుగా అర్ధం చేసుకోవడంతోపాటు మరింత జ్ఞానాన్ని సంపాదించగలుగుతారని స్పష్టం చేశారు. మార్కుల జాబితానే విద్యార్థులకు ‘ప్రెజర్‌ షీట్‌’, తల్లిదండ్రులకు ‘ప్రెస్టేజ్‌ షీట్‌’గా మారిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ఒత్తిడిని తొలగించేందుకే తాజాగా ‘జాతీయ విద్యావిధానం-2020’ను తీసుకొచ్చామన్నారు. ’21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ పేరుతో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన శిక్షా పర్వ్‌ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. విద్యను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకూడదని.. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభించడం ద్వారా విద్యార్థులు బహుముఖ జ్ఞానం పొందేందుకు వీలుంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

మాతృభాషలోనే సులభంగా..

‘జాతీయ విద్యావిధానం-2020 ఆమోదించిన తర్వాత బోధన భాషపై చాలా చర్చ జరుగుతోంది. కేవలం జ్ఞానాన్ని పొందడానికి భాష ఓ సాధనం మాత్రమే.. భాషే జ్ఞానం కాదు’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేవలం పుస్తకాల జ్ఞానానికే పరిమితమైన ప్రజలు.. ఈ ముఖ్యమైన తేడా గమనించడంలేదని అభిప్రాయపడ్డారు. ఏ భాషలో బోధిస్తే చిన్నారులు తేలికగా నేర్చుకుంటారో..అదే బోధన భాష అని స్పష్టం చేశారు. జపాన్‌, ఐర్లాండ్‌, పోలాండ్‌, ఫిన్లాండ్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా చిన్నారులు వారి ఇంట్లో ఏ భాష వింటారో, అదే భాషలో బోధిస్తే సులభంగా ఆర్థం చేసుకుంటారని సూచించారు. అందుకే కనీసం ఐదో తరగతి వరకు బోధన భాష మాతృభాషలోనే కొనసాగాలని నూతన జాతీయ విద్యావిధానం సూచిస్తోందని అన్నారు. అయితే, ఇంగ్లిషుతోపాటు ఇతర భాషలను నేర్చుకునేందుకు మాత్రం ఎటువంటి పరిమితులు లేవని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

‘జాతీయ విద్యావిధానం-2020’ అమలులోభాగంగా ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసేందుకు ‘శిక్షా పర్వ్’ను ఈ సెప్టెంబర్ 8 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నారు. దీనిలోభాగంగా జాతీయ విద్యావిధానంలోని వివిధ అంశాలపై దేశవ్యాప్తంగా వెబినార్లు, వర్చువల్ సమావేశాలు, కాన్క్లేవ్ లను విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.