
శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో అధికారికంగా చేరినందుకు టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కొనియాడాడు. వీటి చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నాడు. భీకరంగా పోరాడే అత్యుత్తమ ఫైటర్ జెట్ ఫైలట్లు వీటిని నడుపుతారని వెల్లడించాడు. ఈ మేరకు అతడు వరుస ట్వీట్లు చేశాడు.
ఆట పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ భారత సైన్యానికి సంబంధించిన అంశాల్లో ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. ఎందుకంటే అతడు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్ట్‌నెంట్ కర్నల్ హోదాలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సరిహద్దుల్లోకి వెళ్లి విధులు నిర్వర్తిస్తుంటాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత మహీ రెండు నెలలు సైన్యంలో పనిచేశాడు. గతంలో పద్మభూషణ్ పురస్కారాన్ని సైతం సైనిక దుస్తుల్లోనే అందుకున్నాడు.
‘పోరాటాల్లో అత్యుత్తమ పరాక్రమాన్ని ఘనంగా చాటుకున్న 4.5తరం యుద్ధవిమానాలను గొప్ప పైలట్లు నడుపుతారు. మన పైలట్ల సురక్షిత చేతుల్లో ఉండే ఈ లోహ విహంగాలు మిగతా యుద్ధవిమానాలతో కలిసి భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత ప్రమాదకరంగా, పరాక్రమంగా, పటిష్ఠంగా మారుస్తాయి. 17వ స్క్వాడ్రన్ (గోల్డెన్ యారోస్)కు అభినందనలు. మిరేజ్ 2000 సేవా రికార్డులను రఫేల్ బద్దలు కొడతాయనే అనుకుంటున్నాను. అయితే సుఖోయ్ 30ఎంకేఐ మమాత్రం ఎప్పటికీ నాకిష్టం. ఇవి సూపర్ సుఖోయ్‌గా ఉన్నతీకరణ చెందాలి’ అని ధోనీ ట్వీట్ చేశాడు. మరో క్రికెటర్ మనోజ్ తివారీ సైతం వాయుసేనకు అభినందనలు తెలియజేశాడు.





