
కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన కేంద్ర భారీ పరిశ్రమల, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు దిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ”నేను కరోనా నుంచి కోలుకున్నాను. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నాను. ఆస్పత్రిలో నాకు చికిత్స అందించిన వైద్యులు, నర్సుల బృందానికి నా కృతజ్ఞతలు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అని మంత్రి ట్వీట్ చేశారు. ఈ నెల 8న తనకు కరోనా సోకినట్లు మంత్రి వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు.
ఇప్పటి వరకు నలుగురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు. వారిలో హోం మంత్రి అమిత్ షా, భారీ పరిశ్రమల మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కోలుకున్నారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ మాత్రం ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.