ArticlesNews

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

298views

చైనా భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అధినాయకత్వం వహిస్తున్న మౌనంపై సహజంగానే మన దేశంలో ఉన్న అనేకులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వారాల తరబడి ఇరు దేశాల సైనికులు సరిహద్దులలో మోహరించి ఉన్న తరుణంలో చైనాపై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న, అనుసరించ బోతున్న వ్యూహం ఏమిటో అర్జెంటుగా తమకు తెలియజెప్పాలన్నది వారి వాదన.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాలలో చైనా, భారత భూభాగాలను కబళించిన విషయంపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్న వారెవరూ ఎప్పుడూ నోరు మెదపలేదు. ఏ ప్రశ్నలూ సంధించలేదు. సమాధానాలు ఇవ్వలేదు.

పైగా ఇప్పుడు బలమైన చైనాతో పెట్టుకోవడం భారత్ కు క్షేమకరం కాదన్నట్టుగా భారత్ ను నిస్సిగ్గుగా హెచ్చరిస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికలలో నిర్లజ్జగా చైనాను వెనకేసుకొస్తున్నారు, భారత నాయకత్వాన్ని నిందిస్తున్నారు.

ఇలాంటి వాళ్ళ ప్రేలాపనల సంగతి ఎలా ఉన్నా భారత ప్రభుత్వం ఇన్నాళ్ల పాటు కుటిల చైనాతో చర్చల పేరుతో ఎందుకు కాలక్షేపం చేసింది అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే సామ్రాజ్యవాద చైనాది దురాక్రమణ మనస్తత్వం అన్నది నిర్వివాదాంశం. ఆ కారణంగానే చైనాతో సరిహద్దును పంచుకుంటున్న  ఏ దేశంతోనూ చైనాకు సత్సంబంధాలు లేవు. జపాన్, రష్యాలతో కూడా చైనా సరిహద్దుల విషయంలో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంది. అలాంటి దురాక్రమణవాద చైనాతో భారత్ కొంత కఠినంగానే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు చైనా విషయంలో అవలంబించిన మెతక వైఖరే చైనా ప్రస్తుత దూకుడుకి కారణం. అదే తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా చేయకూడదు. మనకు కలసివచ్చే దేశాల అండతో చైనాతో కొంత దూకుడుగా వ్యవహరిస్తేనే చైనా కుయుక్తులకు కళ్లెం పడుతుంది.

అయితే ప్రస్తుతం ప్రభుత్వం కూడా చైనా విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది. అసలు చైనాను సరిహద్దులు దాటి ముందడుగు వెయ్యనివ్వకపోవడమే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు.

నిజానికి చైనా బలుపు చూసి వణికిపోవాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం భారత్ లేదు. విశేషమైన శక్తి సామర్ధ్యాలు, ఆయుధ సంపత్తి ఇప్పుడు భారత్ సొంతం. మోడీ ప్రభుత్వం ఆదినుంచి సైనిక, ఆయుధ సంపత్తిని మెరుగుపరచుకోవడానికే విశేష ప్రాధాన్యం ఇచ్చింది. పర్వత ప్రాంతాలలో యుద్ధం చేయగలిగిన నైపుణ్యము, అనుభవము భారత సైనికుల సొంతం. అంతేకాదు చరిత్రను పరికించి చూసినా….. అతిచిన్న దేశాలతో తలపడిన పెద్ద పెద్ద దేశాలు సైతం సాధించింది ఏమీ లేదన్న సంగతి మనకు అవగతమవుతుంది. ఉదాహరణకు శక్తివంతమైన అమెరికాపై వియత్నాం విజయం సాధించింది. రెండు దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్తాన్ ను తన గుప్పెట్లో పెట్టుకున్న అమెరికా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడం మినహా అక్కడ సాధించింది ఏమీ లేదు. అలాగే ఇరాక్ అమెరికాను ముప్పు తిప్పలు పెడుతూ ఉంది.

కనుక చైనా సొంత మీడియా తన దేశం యొక్క శక్తియుక్తులను గూర్చి కొట్టుకునే సొంత డబ్బాను చూసో, చైనాకి అంతుంది, ఇంతుంది అంటూ భారత్లోని చైనా భక్తులు కొట్టే డప్పును చూసో భారత్ జడవవలసిన పనిలేదు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే చైనాను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మోడీ ప్రభుత్వంలో సూది మోపినంత భూభాగం కూడా పరాధీనం కాదని భారత దేశ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై గట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఆ విషయంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు కూడా. దేశం యొక్క సరిహద్దులను, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో భారతదేశపు ప్రస్తుత నాయకత్వం యొక్క చిత్తశుద్ధిని, పోరాటపటిమను శంకించనవసరంలేదు.

లోక్ సత్తా నాయకులు శ్రీ జయ ప్రకాశ్ నారాయణ తరచుగా ఒక మాట అంటూ ఉంటారు. “మన ప్రధాని మోడీ ఎంతటి మహత్కార్యాన్నైనా సాధించగలిగిన శక్తివంతుడు, అంతటి ప్రజామోదం, మద్దతు కలిగినవాడు” అని. అది ముమ్మాటికీ నిజం. దూకుడుగా వ్యవహరించడం ద్వారా పాకిస్తాన్ దుశ్చర్యలకు, దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయగలిగింది మోడీ ప్రభుత్వం.  మానని కురుపుగా మారి దశాబ్దాలుగా సలుపుతున్న కాశ్మీర్ సమస్యకు ఒక సాహసోపేతమైన పరిష్కారాన్ని చూపించగలిగింది. దెబ్బతిని ఊరుకోవడం కాదు అంతకు రెండింతల నొప్పి కలిగేలా దెబ్బకొట్టి చూపిస్తోంది భారత నాయకత్వం పాకిస్తాన్ కు. అలాగే దశాబ్దాలుగా పక్కలో బల్లెంలా మారిన చైనాకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకు ఇదే తగిన సమయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు కూడా.

దుష్ట చైనాకు బుద్ధి చెప్పే విషయంలో మన సైనికులు చేసే పోరాటం ఒక ఎత్తయితే, సామాన్య పౌరులమైన మన యొక్క సంకల్పం కూడా ఎంతో ప్రధానమైనది. కారణం చైనా యొక్క ఆర్థిక పుష్టికి భారతీయ వాణిజ్య విపణి ప్రధాన ఆధారం. చైనా నుంచి ఉత్పత్తయ్యే చౌకబారు ఉత్పత్తులకు అతిపెద్ద కొనుగోలు కేంద్రం భారతదేశం. ఇప్పుడు మనం మన దేశ భక్తిని, చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. చైనా ఉత్పత్తులను నిరాకరించడం ద్వారా, వాటి కొనుగోలును తోసిరాజనడం ద్వారా మనం చైనాను తీవ్రంగా దెబ్బతీయగలం. యుద్ధరంగంలో సైనికులు చేసే పోరాటం మాత్రమే కాదు కొనుగోలు రంగంలో మనం చూపే విచక్షణ కూడా ఒక యుద్ధమే, పోరాటమే, చైనాపై ఎక్కుపెట్టిన ఒక అస్త్రమే. భారతీయులుగా ఈ సంక్షోభ సమయంలో మనం కాసింత విచక్షణను ప్రదర్శిద్దాం. మనం ఆ మాత్రం విచక్షణను ప్రదర్శించలేకపోతే సరిహద్దుల రక్షణ కోసం ప్రాణాలర్పించిన యోధుల త్యాగాలకు అర్థమే లేకుండా పోతుంది.  చైనా ఉత్పత్తులు కొనేటప్పుడు మనకు మన సూర్యాపేట యోధుడు సంతోష్, తమిళనాడుకు చెందిన పళని కుమార్, చత్తీస్ గడ్ కు చెందిన గణేష్ రాం కుంజెన్ వంటి వీరులందరి బలిదానాలు గుర్తుకురావాలి. వారందరూ మన కోసమే, మన రక్షణ కోసమే ప్రాణత్యాగాలు చేశారన్న విషయం మన మదిలో మెదలాలి. వారందరూ తమ మాతృభూమి ఋణం తీర్చుకున్నారు. మనకు కూడా ఇప్పుడొక అవకాశం లభించింది. మనం వారిలా ప్రాణార్పణ చెయ్యాల్సిన పనిలేదు.  చైనా ఉత్పత్తులను నిర్మొహమాటంగా నిరాకరిస్తే చాలు. మన మాతృభూమి పట్ల ఆ మాత్రం భక్తిని ప్రదర్శించడం మన కనీస కర్తవ్యం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రదర్శిస్తాం?

అయితే చైనాను నిజంగా యుద్ధరంగంలో ఢీకొనాల్సిన పరిస్థితే వస్తే……  అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయిల్ వంటి దేశాల సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం ఇప్పుడు మనకు ఉంది. అన్నిటికీ మించి భారతదేశ నాయకత్వానికి 130 కోట్ల భారతీయుల అండదండలు మెండుగా ఉన్నాయి. పోరాడాలన్నదే అందరి ఆకాంక్ష కూడా. “పోరాడితే పోయేదేమీ లేదు. పొరుగువాడి దురహంకారం తప్ప” మోడీజీ! ఇక వెనకడుగు వేయకండి. రెట్టించిన శక్తితో, ఉత్సాహంతో ముందడుగు వేయండి.

“ముస్కురాతె ఖిల్ ఉఠే ముకుల్ పాత్ పాత్ మే

లహర్ లహర్ సమ్ ఉఠే హర్ ప్రఘాత్ ఘాత్ మే

స్తుతి నిందా లాభ్ లోభ్ యశ విరక్తి జావ్ సే

చరణ్ శీఘ్ర దృఢ బఢే ధ్యేయ శిఖర హమ్ చడే”

(ఒక్కొక్క అడుగే వేసుకుంటూ శిఖరాన్ని ఎక్కుదాం

ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ లేద్దాం

స్తుతి, నింద, లాభము, లోభము, యశస్సు, విరక్తి వంటి భావనలను విడచి

ధ్యేయ శిఖరాన్ని అధిరోహించడానికి వడివడిగా అడుగులు వేద్దాం)

– శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.