
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ ప్రాంతం నుంచి చైనా బలగాలు కొద్దికొద్దిగా వెనక్కు వెళుతున్నాయి. పాంగాంగ్ సెక్టార్‌లోని బలగాలు కూడా వెనక్కు మళ్లుతున్నట్లు భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చైనా బలగాలు నిన్నటి నుంచే విరమణ ప్రక్రియ ప్రారంభించాయని, అందుకు అనుగుణంగా భారత్ కూడా తమ బలగాలను వెనక్కి రప్పిస్తోందని ఆ అధికారి పేర్కొన్నారు. త్వరలోనే సరిహద్దులో ప్రతిష్టంభనలు తగ్గి పూర్వ స్థితి నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఇరుదేశాల మిలిటరీ కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున మేజర్ జనరల్ లియు లిన్‌లు పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద మే 5న చైనా బలగాలు మోహరించడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. చైనా బలగాలు ఆయుధ సామాగ్రితో గల్వాన్ సెక్టార్‌ని మూడు ప్రాంతాల్లో ఆక్రమణలకు దిగాయి. భారత ఆర్మీ పెట్రోలింగ్ పాయింట్లు 14, 15, 17 వద్ద అవి మోహరించాయి. ఈ ప్రాంతాలన్నీ గల్వాన్ కాలువ, షైయోక్ నది సంగమాలకు తూర్పున 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్లేందుకు భారత్ నిర్మిస్తున్న 60మీటర్ల పొడవైన వ్యూహాత్మక బ్రిడ్జి కట్టడానికి చైనా బలగాలు అభ్యంతరం తెలిపాయి. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం చైనా బలగాలు పూర్తిగా ఖాళీ చేసినట్లు ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. గత నెల రోజులుగా చైనా సైనికులు టెంట్లు వేసి పహారా కాస్తున్న పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద కూడా భారత బలగాలు దీటుగా మొహరించాయి. ఈ ప్రాంతాన్ని కూడా ఇరు పక్షాలు ఖాళీ చేస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.
ఇక గల్వాన్ సెక్టార్‌లో పెట్రోలింగ్ పాయింట్ 17లోనూ రెండు దేశాలు సైనికులు సాయుధ వాహనాలతో మోహరించారు. ఇక్కడ నుంచి సాయుధ వాహనాలు వెనక్కు మళ్లుతున్నాయని, తరువాత సైనికులు కూడా నిష్క్రమిస్తారని ఆ అధికారి వివరించారు. పాంగాంగ్ సరస్సు వద్ద నిష్క్రమణ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని ఓ సీనియర్ ఆర్మీ అధికారి పేర్కొన్నారు. సిరిజాప్ రేంజ్‌లో ఫింగర్ 4 వరకూ చైనా బలగాలు వచ్చాయి. ఆ ప్రాంతంలో 124 వాహనాలు, 14 పడవల్ని మోహరించాయి. ఇక్కడ పడవల్ని వెనక్కు మళ్లిస్తున్నారని, త్వరలోనే ఆ ప్రాంతంలో ఆక్రమణలు తొలగుతాయని అన్నారు.





