
కరోనా లాక్‌డౌన్ సమయంలో భౌతిక దూరం వంటి నిబంధనలను అతిక్రమించి మంగళవారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్‌లో వేలాదిమంది వలసదారులు గుమిగూడారు. కాగా, ఈ ఘటనలో సుమారు 1000 మందిమీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని…ఈ ఘటనకు బాధ్యుడని భావిస్తున్న వినయ్ దూబె అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల అనంతరం ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన… తదనంతరం లాఠీఛార్జికి కూడా దారితీసింది. అక్కడకు చేరుకున్న వారిలో బెంగాల్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు చెందినవారు అధికంగా ఉన్నారు.
లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్నందున వలస కార్మికులు తమతమ గ్రామాలకు చేరుకోవటానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా వినయ్ దూబే ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నట్టు ఉన్న వీడియో ఒకటి నిన్నటి నుంచి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. తాము 14వ తేదీ వరకు వేచిచూస్తామని, లేదంటే వారితో కలసి కాలినడకన బయలుదేరుతానని ఆయన అంటున్నట్టు కూడా ఈ వీడియోలో ఉంది.
కార్మిక నేతనని చెప్పుకుంటున్న వినయ్, లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ స్వంత ఊర్లకు తరలివెళదామనే ఆలోచనను వలసదారులలో ప్రేరేపించినట్టు భావిస్తున్నారు. ‘చలో ఘర్ కీ ఓర్…’ (ఇంటికి వెళదాం) అనే పేరుతో ఈయన ఓ సోషల్ మీడియా ఉద్యమాన్ని కూడా చేపట్టారు. కాగా ఆయన ట్విటర్, ఫేస్‌బుక్‌లలో వినయ్ పోస్టులు వేల మంది గుమిగూడటానికి కారణమయిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినయ్ దూబే ‘ఉత్తర్ భారతీయ మహా పంచాయత్’ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు. కాగా, ఈయనను నవీ ముంబయి ప్రాంతంలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.