
(నవంబర్ 24: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి)
భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయుధం పట్టిన తొలి విప్లవ వీరులలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది విశిష్ఠ స్థానం. 1857 సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ళ కంటె ముందే, 1846లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను సవాలు చేస్తూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. రాయలసీమ గడ్డపై స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ఆయన పోరాటం భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1806 నవంబరు 24న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో పాలెగాళ్ళ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పెద మల్లారెడ్డి, తల్లి సీతమ్మ. తండ్రి మరణానంతరం కుటుంబ వారసత్వంగా వచ్చిన హక్కులు, బాధ్యతల విషయంలో బ్రిటిష్ పాలకులతో ఆయనకు వివాదాలు ఏర్పడ్డాయి.
ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో తన అధికారాన్ని విస్తరించే క్రమంలో స్థానిక పాలెగాళ్ల అధికారాలను తొలగించి, వారి ఆదాయ వనరులను చేజిక్కించుకుంది. ఆ క్రమంలో నరసింహారెడ్డి కుటుంబానికి భరణం, గౌరవం, హక్కుల విషయంలోనూ అన్యాయం చేసింది. అదే సమయంలో రైతులపై అధిక పన్నులు, స్థానిక ప్రజలపై అధికారుల దౌర్జన్యాలు, సంప్రదాయ వ్యవస్థల విధ్వంసం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఆ పరిస్థితుల్లో నరసింహారెడ్డి కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరగబడ్డారు.
1846 జూన్ 10న నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి కోయిలకుంట్లలోని ప్రభుత్వ ఖజానాపై దాడి చేయడంతో తిరుగుబాటు ప్రారంభమైంది. తొలుత కొద్దిమందితో ప్రారంభమైన ఉద్యమానికి క్రమంగా రైతులు, బోయలు, చెంచులు, స్థానిక పాలెగాళ్ళు, ఇతర వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. ఆయన అనుచరుల సంఖ్య వేలల్లోకి చేరింది.
కంపెనీ సైన్యాలు తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నించాయి. గిద్దలూరు ప్రాంతంలో కంపెనీ సైన్యానికి, నరసింహారెడ్డి సేనలకూ పోరు జరిగింది. కంపెనీ సైనికుల నిరంతర దాడులను తప్పించుకుంటూ ఆయన నల్లమల, ఎర్రమల అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ పోరాటాన్ని కొనసాగించారు. నరసింహారెడ్డిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం భారీ బహుమతి ప్రకటించింది. కుటుంబ సభ్యులను నిర్బంధించి ఆయనపై ఒత్తిడి తెచ్చినా ఆయన లొంగిపోలేదు.
1846 అక్టోబరులో నల్లమల ప్రాంతంలోని పేరుసోమల సమీపంలో బ్రిటిష్ సైన్యాలు నరసింహారెడ్డిని పట్టుకున్నాయి. ఆయనపై విచారణ జరిపి మరణశిక్ష విధించారు. 1847 ఫిబ్రవరి 22న కోయిలకుంట్లలో వేలాదిమంది ప్రజల సమక్షంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను బహిరంగంగా ఉరితీసింది. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఆయన తలను కోటవద్ద దాదాపు రెండేళ్ళు వేలాడదీసారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మగౌరవ పోరాటాన్ని పూర్తిస్థాయి స్వాతంత్ర్యోద్యమం అనడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ విదేశీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటం సాగించిన తొలితరం నాయకుల్లో ఆయన అగ్రగణ్యుడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే సాగిన ఆయన పోరాటం భారత స్వాతంత్ర్య చరిత్రలో మరువలేని ఘట్టం. ఆయన త్యాగం రాయలసీమ ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.





