
‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ వేల గొంతుకలు ఒక్కటై శరణు ఘోష చేస్తుండగా కేరళంలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయం వార్షిక మండల యాత్ర సీజన్ కోసం సోమవారం తెరుచుకుంది. తంత్రి కండారు బ్రహ్మదత్తన్ సమక్షంలో.. నిరుటి ప్రధాన పూజారి ఇ.డి.ప్రసాద్ నంబూద్రీ ఆలయాన్ని తెరిచి, జ్యోతి వెలిగించారు. 18 పవిత్ర మెట్లు దిగొచ్చి.. కొత్తగా నియమితులైన పూజారులను సన్నిధానానికి (ఆలయ సముదాయం) తోడ్కొని వెళ్లారు. అనంతరం ఎ.దామోదరన్ నంబూద్రీ నూతన ప్రధాన పూజారిగా బాధ్యతలు చేపట్టారు. వేల మంది భక్తులు తరలి రావడంతో.. ఆలయ ద్వారాలు తెరుచుకోక ముందు నుంచీ సన్నిధానమంతా ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న శరణు ఘోష ప్రతిధ్వనించింది. మండల యాత్ర సీజన్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు లాంఛనంగా ప్రారంభమవుతుంది. డిసెంబరు 27న మండల పూజ చేస్తారు. అదే రోజు ఆలయాన్ని మూసివేసి.. మకర విళక్కు యాత్ర సీజన్ కోసం డిసెంబరు 30న తిరిగి తెరుస్తారు. మకర విళక్కు ఉత్సవాన్ని జనవరి 14న నిర్వహిస్తారు. జనవరి 30న ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సీజన్లో రోజుకు 80 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.





