News

‘రామ్ దర్బార్’ నిర్మాణం కు ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తింపు!

0views

అయోధ్య దీపోత్సవం 2026 వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ సైకత శిల్పి మధురేంద్ర కుమార్ ఒక చరిత్రాత్మక ఘనతను సాధించారు. సరయూ నది నుంచి సేకరించిన 220 టన్నుల ఇసుకను ఉపయోగించి 58 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తుతో కూడిన భారీ ‘రామ్ దర్బార్’, రామమందిర నమూనా శిల్పాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అయోధ్యలోని సరయూ నదీ ఒడ్డున ఉన్న రామ్ కథా పార్క్‌లో ఈ శిల్పాన్ని నిర్మించారు. ప్రపంచ శాంతి, మానవత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాలను చాటిచెప్పే ఈ కళాఖండానికి ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’నుంచి అధికారిక గుర్తింపు లభించింది. ఈ కళాకృతిని రూపొందించడంలో మధురేంద్ర కుమార్​కు ఆయన బృందం కూడా సహాయపడింది.

ఏడు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన నిర్మాణ పనులు
అక్టోబర్ 30న ప్రారంభమైన ఈ శిల్ప నిర్మాణ పనులు ఏడు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగాయి. చివరికి నవంబర్ 7న పూర్తయ్యాయి. “రామ్ దర్బార్‌ను చిత్రిస్తూ నేను రూపొందించిన మొట్టమొదటి ఇసుక శిల్పం ఇది. ఈ తరహాలో ఇంత పొడవుగా ఇసుకతో నిర్మించడం ఇదే మొదటిసారి” అని మధురేంద్ర కుమార్​ పేర్కొన్నారు. మరోవైపు, దీపోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ శిల్పాన్ని వీక్షించారు. ఈ చరిత్రాత్మక కళాఖండాన్ని అయోధ్య ఎప్పటికీ మరచిపోదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. ప్రపంచ రికార్డు సాధించినందుకు మధురేంద్ర కుమార్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సైతం ఈ అద్భుత కళా నైపుణ్యాన్ని చూసి ‘చాలా బాగా చేశారు’ అని ప్రశంసించారు.

అక్టోబర్ 30న ఈ కళాఖండానికి సంబంధించిన సమాచారాన్ని ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’, ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’కు సమర్పించారు కుమార్​. నవంబర్ 7న ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ దీనిని ఈమెయిల్ ద్వారా ఆమోదించింది. ఈ ఘనత IND/2026/001810 రికార్డు నంబరు కింద అధికారికంగా నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఒక డిజిటల్ సర్టిఫికేట్ కూడా జారీ చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాగా, అయోధ్యను ప్రపంచ పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ కళాఖండం నిదర్శనం అని చెప్పవచ్చు.

12కు పైగా ప్రపంచ రికార్డులను నెలకొల్పిన మధురేంద్ర కుమార్​
బిహార్‌లోని తూర్పు చంపారన్‌కు చెందిన మధురేంద్ర కుమార్, 25కు పైగా దేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 12కు పైగా ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఇసుక, బొగ్గు బూడిద, ఆకులు, పండ్లు, కూరగాయలు, పునర్వినియోగ పదార్థాలను ఉపయోగించి వేలాది కళాఖండాలను సృష్టించిన ఈ కళాకారుడు, అమెరికా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి ఇసుక కళలో గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆయన కళాఖండాలు ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, వ్యసన విముక్తి, ప్రపంచ శాంతి వంటి ఇతివృత్తాలపై దృష్టి సారిస్తాయి. అయోధ్యలోని ఈ అద్భుతమైన కళాఖండం, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం యోగి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, రామ మందిరాన్ని కేంద్రంగా చేసుకున్న దాని అభివృద్ధి నమూనాని మరింత బలోపేతం చేసింది. కాగా, ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య నగరం దీపాల వెలుగులతో ముస్తాబైంది. శనివారం రాత్రి అయోధ్య ధామ్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సరయూ నదీ తీరాన ఉన్న 56 ఘాట్లలో ఏకంగా 30 లక్షలకుపైగా మట్టి ప్రమిదలను (దీపాలు) వెలిగించి, అత్యంత వైభవంగా 10వ దీపోత్సవ వేడుకల్ని నిర్వహించారు. దీప కాంతులతో వెలుగులీనుతూ అయోధ్య నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని, భక్తుల అపారమైన భక్తిశ్రద్ధలను కళ్లకు కట్టాయి.