News

TCS కార్పొరేట్ జిహాద్ కేసు : మాజీ AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్‌పై కేసు నమోదు

8views

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత మార్పిడికి ప్రేరేపించారనే ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై మాజీ AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్‌పై నాసిక్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదే వ్యవహారంలో AIMIM కార్పొరేటర్ మతిన్ పటేల్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఈ కేసు దర్యాప్తులో AIMIM కార్పొరేటర్ మతిన్ పటేల్ మొబైల్ ఫోన్‌లో లభించినట్లు చెబుతున్న ఆడియో రికార్డింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆడియో ఆధారంగా ఇంతియాజ్ జలీల్‌కు సంబంధించిన అంశాలపై కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. SIT అధికారులు ఇంతియాజ్ జలీల్ వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు, ఆయన గొంతు నమూనాలను కూడా సేకరించినట్లు సమాచారం. నిదా ఖాన్‌కు ఆశ్రయం కల్పించడంలో ఎవరి పాత్ర ఉంది? ఆమెకు సహకరించినవారు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఇంతియాజ్ జలీల్ ప్రధాన సూత్రధారి.. జైలుకు వెళ్లాల్సిందే’
ఈ వ్యవహారంపై మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు సంజయ్ శిర్సాత్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిదా ఖాన్‌కు ఆశ్రయం కల్పించడంలో ఇంతియాజ్ జలీల్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. మతిన్ పటేల్‌ను కేవలం ఒక పావుగా ఉపయోగించుకున్నారని, ఈ వ్యవహారం వెనుక ఇంతియాజ్ జలీల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారని శిర్సాత్ వ్యాఖ్యానించారు. నిందితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న సమయంలో వారికి అవసరమైన ఏర్పాట్లు జలీల్ ఆదేశాల మేరకే జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఇంతియాజ్ జలీల్‌తో పాటు మతిన్ పటేల్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.

దర్యాప్తులో వెలుగుచూడనున్న మరిన్ని వివరాలు?
TCS కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై వేధింపులు, మత మార్పిడి ఆరోపణలు, నిందితురాలికి ఆశ్రయం కల్పించారనే వివాదం.. ఇలా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో డిజిటల్ ఆధారాలు, ఆడియో రికార్డింగులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు కీలకంగా మారనున్నాయి.

ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్నది పోలీసుల దర్యాప్తు, న్యాయస్థాన విచారణలో తేలాల్సి ఉంది. బాధితులకు న్యాయం జరగడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.