News

పథ్ సంచలన్ కవాతు మాత్రమే కాదు దేశభక్తికి ప్రతీక

37views

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో విజయదశమి, ఆరెస్సెస్ స్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 22న ‘పథ్ సంచలన్’ నిర్వహించారు. సంప్రదాయ గణవేషంలో వచ్చిన వందలాది మంది స్వయంసేవకులు ఘోష్ వాయిద్యాల శబ్దాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ క్రమశిక్షణ, ఐక్యతను ప్రదర్శించారు. బల్లియాలోని టౌన్ హాల్, వెటర్నరీ హాస్పిటల్, దయానంద విద్యా మందిర్, బిచ్లా ఘాట్ హనుమాన్ ఆలయం ప్రాంతాల నుంచి ఒకేసారి ఈ పథసంచలన్ ప్రారంభమయ్యాయి. వేర్వేరు మార్గాల్లో సాగిన ఈ ఊరేగింపులు చివరకు షహీద్ పార్క్ చౌక్ వద్దకు చేరుకుని కలిసాయి.

ఆ తర్వాత వీర లోరిక్ స్పోర్ట్స్ స్టేడియంలో సభ నిర్వహించారు. భారత్ మాత, మా దుర్గా, శ్రీరాముని చిత్రపటాల ముందు కార్యక్రమ అధ్యక్షుడు అనుజ్ సరాఫ్గీ, ముఖ్య వక్త ముకుల్ కనిత్కర్ దీపప్రజ్వలన చేశారు. దేశభక్తి గీతాలాపన అనంతరం ముకుల్ కనిత్కర్ మాట్లాడారు.

గంగానదిలో దిగితేనే దాని ప్రాశస్త్యం తెలిసినట్లే, కేవలం పుస్తకాలు చదివితే ఆరెస్సెస్ అర్థం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ నేరుగా శాఖకు హాజరైనప్పుడే అక్కడి వాతావరణం, విలువలు అనుభవంలోకి వస్తాయని చెప్పారు. శాఖ అనేది సమాజంలో మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, సేవాభావాన్ని నేర్పించే వేదిక అని వారు వివరించారు.
ఆర్గనైజర్ సౌజన్యంతో

దేశ పురోగతి కేవలం ప్రభుత్వాల వల్ల మాత్రమే సాధ్యం కాదని, మంచి శీలం ఉన్న పౌరులు, సమైక్య సమాజం ఉన్నప్పుడే దేశం ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. కులమత భేదాలను పక్కనబెట్టి సామాజిక ఐక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో చివరి వ్యక్తికి కూడా సేవలు అందాలని, యువతలో దేశభక్తిని నింపాల్సిన అవసరం ఉందన్నారు. పథ్ సంచలన్ అనేది కేవలం కవాతు మాత్రమే కాదని, దేశభక్తికి ప్రతీక అని తెలిపారు. కుటుంబాల్లో నైతిక విలువలను పెంపొందించడమే దేశానికి బలమైన పునాది అని ఆయన స్పష్టం చేశారు.