News

భారతీయ సంస్కృతికి జీవనాడి సంస్కృతం

6views

తిరుపతి సిటీ: భారతీయ సంస్కృతికి సంస్కృత భాష జీవనాడి వంటిదని తిరుపతి రామకృష్ణ మిషన్‌ సభ్యులు స్వామి సుకృతానంద అన్నారు. సంస్కృతం అత్యంత ప్రాచీనమైన, ఉన్నతమైన శాస్త్రీయ భాష అని ఆయన పేర్కొన్నారు.

ఎస్వీ వేదిక్‌ వర్సిటీలో వారం రోజులుగా నిర్వహించిన ‘సంస్కృతోత్సవం–2026’ ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన స్వామి సుకృతానంద మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతతో సంస్కృత భాషకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.

మంత్రాలకు మూలం సంస్కృతమే
రిషికేశ్‌ కైలాస ఆశ్రమానికి చెందిన శ్రీ మేధానందపూరి మాట్లాడుతూ.. భారతీయులు ఆచరించే అనేక మంత్రోపదేశాలు సంస్కృత భాషలోనే ఉన్నాయని తెలిపారు. సంస్కృత భాష పరిరక్షణ, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

వీసీ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ.. మన దేశానికి ‘భారతదేశం’ అనే పేరు సంస్కృత భాష ద్వారానే ఏర్పడిందని పేర్కొన్నారు. భారతీయ జ్ఞాన సంపదను భవిష్యత్ తరాలకు అందించడంలో సంస్కృత భాష కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

13 పోటీల్లో విజేతలకు బహుమతులు
సంస్కృతోత్సవంలో భాగంగా వారం రోజుల పాటు సంస్కృత భాషకు సంబంధించిన 13 రకాల పోటీలను నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముగింపు కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ బలభద్ర ఉపాధ్యాయ, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గిరిజాప్రసాద్‌ షడంగి, డాక్టర్‌ కేవీ నరసింహశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.