News

బెంగళూరులో ఈద్‌ ఊరేగింపు వేళ ఉద్రిక్తత.. కార్యాలయం వద్ద ఘర్షణ

0views

బెంగళూరు: ఈద్‌ ఊరేగింపు సందర్భంగా బెంగళూరులోని బసవనగుడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఆర్‌ రోడ్డులో ఉన్న హిందూ కార్యకర్త పునీత్‌ కెరెహళ్లికి చెందిన ‘రాష్ట్ర రక్షణ పడే’ కార్యాలయం వద్ద ఊరేగింపు సమయంలో అభ్యంతరకర నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

కార్యాలయం వద్దకు ఊరేగింపు చేరుకున్న సమయంలో పునీత్‌ కెరెహళ్లిని ఉద్దేశించి బెదిరింపు నినాదాలు చేశారని ఆయన అనుచరులు ఆరోపించారు. అలాగే ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’, ‘అల్లాహు అక్బర్‌’ వంటి నినాదాలు వినిపించాయని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా పునీత్‌ కెరెహళ్లి, ఆయన అనుచరులు కార్యాలయం నుంచి బయటకు వచ్చి ‘జై శ్రీరామ్‌’ నినాదాలు చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. మురళి అనే కార్యకర్తపై ఇనుప రాడ్‌తో దాడి చేసి గాయపరిచారని రాష్ట్ర రక్షణ పడే కార్యకర్తలు ఆరోపించారు. కార్యాలయాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ఘర్షణకు పాల్పడ్డారని కూడా వారు ఆరోపించారు.

ఘటనపై ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో బసవనగుడి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పునీత్‌ కెరెహళ్లి మద్దతుదారులపై అబ్దుల్‌ రజాక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

మత సామరస్యానికి భంగం కలిగించడం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై పునీత్‌ కెరెహళ్లి, గోపీ గౌడ, వినోద్‌ నటరాజ్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు కమల్‌ పాషా, అబూబకర్‌ సిద్ధిక్‌, సయ్యద్‌ అనాస్‌పై హత్యాయత్నం తదితర ఆరోపణలతో కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు ముగ్గురు మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమ కార్యకర్తపై జరిగిన దాడికి నిరసనగా పునీత్‌ కెరెహళ్లి, ఆయన మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పునీత్‌ కెరెహళ్లితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమ కార్యాలయానికి తగిన భద్రత కల్పించలేదని రాష్ట్ర రక్షణ పడే కార్యకర్తలు పోలీసులపై ఆరోపణలు చేశారు. అయితే ఘటనకు దారితీసిన అసలు కారణాలు, ఎవరు ముందుగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారనే విషయాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పునీత్‌ కెరెహళ్లిని పోలీసు వాహనంలో తరలిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వాహనాన్ని వెంబడించి దాడికి ప్రయత్నించారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపైనా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఘటనపై డీసీపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఘర్షణకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించేందుకు సంఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నట్లు తెలిపారు. వీడియో ఆధారాలు, ఫిర్యాదులు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఘటనపై పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం బసవనగుడి ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని అధికారులు తెలిపారు.