
ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం వేదికగా గిరిజన సంప్రదాయ కళ థింసా నృత్యం అరుదైన ఘనత సాధించింది. ఒకే వేదికపై ఒకేసారి 13 వేల మంది గిరిజన కళాకారులు థింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు ఈ భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో 11 వేల మంది కళాకారులతో జరిగిన థింసా నృత్య ప్రదర్శన రికార్డును తాజాగా 13 వేల మంది కళాకారుల ప్రదర్శన అధిగమించింది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల పర్యవేక్షణలో కళాకారులు ముందస్తు సాధన చేశారు. నిర్ణీత క్రమంలో 13 వేల మంది ఒకేసారి సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించడంతో ఈ ఘనత నమోదైంది.గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి*సమక్షంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
విమానాశ్రయ ప్రారంభోత్సవానికి థింసాతో స్వాగతం
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 13 వేల మందికి పైగా బాలికలు, మహిళలు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఈ భారీ ప్రదర్శన కోసం పాడేరు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థినులు, మహిళలు భోగాపురంలో ప్రత్యేక శిక్షణ పొందారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన థింసా నృత్యానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు, ఈ కళకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసినట్లు అధికారులు తెలిపారు.




