News

‘షాజాద్ భట్టి నెట్‌వర్క్’ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం

2views

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘షాజాద్ భట్టి నెట్‌వర్క్’ (ఎస్​బీఎన్)పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు అమిత్ షా ‘ఎక్స్’​ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

“ఈ నెట్​వర్క్​, అంతర్జాతీయ సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతోంది. అంతేకాదు, అమాయక యువతను, చిన్నపాటి నేరస్థులను తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, మత సామరస్యాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత డిజిటల్ మాధ్యమాల్లో విద్వేషపూరిత కంటెంట్‌ను ప్రచారం చేస్తోంది.”- అమిత్​ షా కేంద్ర హోంమంత్రి

ఈ నెట్​వర్క్​​​ అక్రమ కార్యకలాపాలపై ఉపాతో పాటు భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టం, ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం వంటి పలు చట్టాల కింద కేసులు నమోదయ్యాయని షా తెలిపారు.